తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీదేవి.. ఓ మరపురాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం - శ్రీదేవి

ఆమె సినీ వినీలాకాశంలో ఓ ధృవతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడిచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఆమే శ్రీదేవి. అందాల తారగా, అభినయంలో మేటిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి తారస్థాయికి ఎదిగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. నేడు ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా ఆమెపై ప్రత్యేక కథనం మీకోసం..

Sridevi
శ్రీదేవి

By

Published : Feb 24, 2021, 11:00 AM IST

శ్రీదేవి అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. పుట్టింది 1963 ఆగస్టు 13న శివకాశిలో. తండ్రి అయ్యప్పన్‌ న్యాయవాది. తల్లి రాజేశ్వరి మంచి నర్తకి. పురుషోత్తమరెడ్డి నిర్మించిన 'చివరకు మిగిలేది' సినిమాలో నృత్యం కూడా చేసింది. వృత్తిరీత్యా తండ్రి మద్రాసుకు మకాం మార్చాడు. అప్పుడు శ్రీదేవికి ఆరేళ్లు. రెండవ తరగతి చదువుతుండగా ఎం.ఎ.తిరుముగం నిర్మించిన భక్తిరస చిత్రం 'తుణైవాన్‌'లో బాలమురుగన్‌గా నటించే అవకాశం దొరికింది.

శ్రీదేవి

అలా వరసగా చాలా తమిళ సినిమాల్లో బాలనటిగా నటించింది. 1970లో మహాలక్ష్మి మూవీస్‌ నిర్మాణంలో కృష్ణ, విజయనిర్మల నటించిన 'మానాన్న నిర్దోషి'లో తొలిసారి బేబీ శ్రీదేవిగా తెలుగు తెరపై కనిపించింది. 1971లో మలయాళ చిత్రంలో 'పూంపట్టా'లో నటనకు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకుంది.

తర్వాత 'కండన్‌ కరుణై', 'కనిముత్తు', 'నమ్‌ నాడు', 'భారత విలాస్‌', 'ఆది పరాశక్తి', 'ప్రార్ధన', 'బాబు', 'బడిపంతులు', 'బాల భారతం', 'వసంత మళిగై', 'భక్త కుంబర' మొదలైన బహుభాషా చిత్రాల్లో చిన్న వయసులోనే బాలతారగా నటించి మెప్పు పొందింది. హిందీ చిత్రసీమకు బాలనటిగా 'జూలీ' (1975) సినిమాలో హీరోయిన్‌ లక్ష్మికి చెల్లెలుగా పరిచయమైంది. అమాయకత్వం నిండిన అందాలరాశిగా నిలిచి దిగ్గజ కథా నాయకుల సరసన సిరిమల్లె పూవుగా ఒదుగుతూ ఎదిగింది.

శ్రీదేవి

సిరిమల్లె పూవై...

1976లో తొలిసారి కథానాయికగా బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముడిచ్చులో కమల్‌హాసిన్‌, రజనీకాంత్‌ సరసన నటించింది. అయితే ఈ సినిమాకు పదిహేను రోజుల ముందే రజనీ సరసన నటించిన పట్టాభిరామన్‌ చిత్రం గాయత్రి సినిమా విడుదలైంది. అదే హీరోయిన్‌గా శ్రీదేవి తొలి చిత్రం. తర్వాత వరుసగా కవిక్కుయిల్, పత్తినారు వయత్నిఇలే సినిమాల్లో వైవిధ్య పాత్రలు పోషించింది.

శ్రీదేవి

తెలుగులో కె.ఎస్‌.రామిరెడ్డి దర్శకత్వం వహించిన సృజన వారి అనురాగాలు చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆపైన భారతీరాజా చిత్రం సిగప్పు రోజాక్కళ్, ముత్తురామన్‌ సినిమా ప్రియా, లక్ష్మీ దీపక్‌ చిత్రం కార్తీక దీపం, మహేంద్రన్‌ సినిమా జానీ, బాలచందర్‌ చిత్రాలు వరుమాయిన్‌ నిరం సివప్పు, ఆకలి రాజ్యం, దాసరి చిత్రం బొబ్బిలి పులి, రాఘవేంద్రరావు సినిమా పదహారేళ్ల వయసు, జస్టిస్‌ చౌదరి మొదలైన వాటిల్లో హీరోయిన్‌గా నటించి స్థిరపడింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ మలయాళంలో ఐ.వి.శశి చిత్రం అభినందనం, ఎం.శంకరన్‌ చిత్రం తులవర్షం, సత్యవాన్‌ సావిత్రి వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది.

1981లో విడుదలైన మీండం కోకిల సినిమాలో నటనకు శ్రీదేవికి ఫిలింఫేర్‌ వారి ఉత్తమ నటి బహుమతి లభించింది. తరవాతి సినిమాల్లో ఉత్తమ నటనకు 14 సార్లు అర్హత సాధించి నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులును అందుకుంది. 'మూండ్రాంపిరై'లో బుద్ధిమాంద్యం గల వికలాంగురాలిగా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటి బహుమతి గెలుచుకుంది.

శ్రీదేవి మైనపు బొమ్మ

కమల్‌హాసన్‌తో 22 సినిమాలు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 23 సినిమాలలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించడం ఒక రికార్డు. మునుపటి తరం నాయకులు ఎమ్జీఆర్‌, శివాజీ గణేషన్‌, శివకుమార్‌ల సరసన కూడా శ్రీదేవి రాణించడం గొప్ప విషయం. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, అక్కినేని సరసన ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, ప్రేమకానుక, కృష్ణ సరసన కలవారి సంసారం, బుర్రిపాలెం బుల్లోడు, శోభన్‌ బాబు సరసన కార్తీక దీపం, దేవత, చిరంజీవి సరసన జగదేకవీరుడు - అతిలోకసుందరి, ఎస్‌.పి.పరశురాం, వెంకటేష్‌ సరసన క్షణక్షణం, నాగార్జునతో ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా సినిమాలు శ్రీదేవి నటించిన వాటిలో ముచ్చుకు కొన్ని మాత్రమే.

అశ్వనీదత్‌తో శ్రీదేవికి చాలా అనుబంధం ఉంది. సావిత్రి తర్వాత అశ్వనీదత్‌ అభిమానించిన నటి శ్రీదేవి. ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటిస్తే, 'ఆఖరిపోరాటం' సినిమాలో అక్కినేని తనయుడు నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం.

శ్రీదేవి వివాహం..

శ్రీదేవి, బోనీకపూర్‌లది ఆదర్శ జంటగా బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటూ వుంటాయి. అయితే బోనీకపూర్‌ని వివాహ మాడకముందు ఆమె సహనటుడు మిథున్‌ చక్రవర్తిని 1985లో రహస్య వివాహం చేసుకుందని చెబుతారు. మిథున్‌ చక్రవర్తి అప్పటికే వివాహితుడు. నటి యోగితా బాలి అతని భార్య. వీరి వివాహ విషయం తెలిసి యోగితా ఆత్మహత్యాయత్నం చేయడం వల్ల వీరి వివాహబంధం తెగతెంపులైందని అంటారు. మిథున్‌తో విడిపోయాక శ్రీదేవి 1996లో బోనీకపూర్‌ని గుడిలో నిరాడంబరంగా పెళ్లాడింది. అప్పుడే బోనీ తొలి భార్య మోనాను, పిల్లల్ని దూరంగా ఉంచాడు.

శ్రీదేవి

తల్లి ఋణం తీర్చుకున్న తనయ...

తల్లి రాజేశ్వరి అంటే శ్రీదేవికి వల్లమాలిన అనురాగం. ఆమె మాటంటే శ్రీదేవికి వేదవాక్కు. శ్రీదేవి చిత్రపరిశ్రమలో అడుగు పెట్టడానికి ఆమె తల్లే కారణం. ఆమెకు మెదడులో ప్రాణాంతక కణితి పెరగడం వల్ల అత్యుత్తమ చికిత్స కోసం శ్రీదేవి హుటాహుటిన తల్లిని అమెరికా తీసుకొని వెళ్లింది. 1995 మే 26న న్యూయార్క్‌ నగరంలోని మెమోరియల్‌ స్లోయన్‌ కెట్టెరింగ్‌ క్యాన్సర్‌ కేంద్రంలో రాజేశ్వరి మెదడుకు శస్త్ర చికిత్స జరిగింది.

ఈ ఆపరేషన్‌ నిర్వహించిన న్యూరో చీఫ్‌ ఈహుద్‌ ఆర్బిట్‌ పొరపాటున ఎడమవైపు చేయాల్సిన ఆపరేషన్‌ను కుడివైపు చేయడం వల్ల రాజేశ్వరి జ్ఞాపకశక్తి కోల్పోయింది. తర్వాత కోమాలోకి వెళ్లింది. అప్పటికే తండ్రి అయ్యప్పన్‌ను కోల్పోయిన శ్రీదేవి మానసికంగా తట్టుకోలేక పోయింది. అప్పుడే బోనీ కపూర్‌ శ్రీదేవికి అండగా నిలిచాడు. మద్రాస్‌కు తల్లిని తరలించాక ఈ విషయం తెలిసిన శ్రీదేవి.. అమెరికన్‌ కోర్టులో కేసు వేసింది. కోమాలో ఉంటూ అశక్తురాలైన శ్రీదేవి తల్లి ఆలనా పాలన తిరుపతిలో వుండే పినతల్లులు అనసూయమ్మ, మునిసుబ్బమ్మ చూసుకున్నారు. తల్లి రాజేశ్వరి తనకు కొడుకైనా, కూతురైనా శ్రీదేవే అని అంటుండేది. అందుకే తల్లికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి తల్లి రుణం తీర్చుకుంది శ్రీదేవి.

శ్రీదేవి

మరణం

2018 ఫిబ్రవరి 24న అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమె హోటల్‌ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగారు.

మరిన్ని విశేషాలు

  • సాధారణంగా సినిమాలలో హీరోయిన్ల కెరీర్‌ తొందరగా ముగిసిపోతుంది. తర్వాత కొందరు వదిన, అక్క వంటి పాత్రల్లో రాణిస్తూ చివరకు తల్లి పాత్రలకు పరిమితమవుతూ వుంటారు. శ్రీదేవి విషయంలో అది తప్పని తేలింది. 1970లో ప్రారంభమైన శ్రీదేవి సినీ ప్రస్థానం అప్రతిహతంగా 1990 వరకూ కొనసాగింది. చివరిసారిగా తెలుగులో ఆమె 1994లో చిరంజీవి ప్రక్కన 'ఎస్‌.పి. పరుశురాం'లో హీరోయిన్‌గా నటించింది.
  • 2013లో శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారం లభించింది. శ్రీదేవి ఉత్తమనటిగా 14 సార్లు ఫిలింఫేర్‌ బహుమతికి అర్హత సాధించింది. ఆరుసార్లు ('మిస్టర్‌ ఇండియా', 'లమ్హే', 'చాల్బాజ్', 'క్షణక్షణం', 'మీండుం కోకిల', 'పత్తినారు వయత్తినిల') ఈ బహుమతి ఆమెను వరించింది. 'జీ' సినీ వంటి సంస్థల నుంచి అందుకున్న బహుమతులకు లెక్కేలేదు. భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ ఆంగ్ల టెలివిజన్‌ ఛానల్‌ సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ నిర్వహించిన 'ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌' జాబితాలో శ్రీదేవికి స్థానం దక్కింది.
  • బోనీకపూర్‌ నిర్మాణంలో సహారా వన్‌ టెలివిజన్‌ ప్రసారం చేసిన 184 సంచికల 'మాలినీ అయ్యర్‌' కామెడీ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
  • కూతురు జాహ్నవి కపూర్‌ను తనంతటి నటిగా రూపుదిద్దాలనేది శ్రీదేవి ఆశయం. 2016లో మరాఠీలో విడుదలైన 'సైరత్' సినిమా ఆధారంగా నిర్మిస్తున్న 'ధడక్‌' సినిమాలో జాహ్నవిని కరణ్‌ జోహార్‌ హీరోయిన్‌గా పరిచయం చేశాడు. అయితే ఈ చిత్రం చూడకుండానే శ్రీదేవి అసువులు బాయడం విధి లిఖితం.
  • 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి తొలిసారి తమిళంలో నటుడు విజయ్‌ వ్యవహారాలు చూసే సెల్వకుమార్‌ నిర్మించిన 'పులి' (2015) ఫ్యాంటసీ సాహస చిత్రంలో క్రూరమైన వేధలపురం యువరాణి పాత్రలో విలన్‌గా నటించి రాణించింది.
  • శ్రీదేవికి, మైఖేల్‌ జాక్సన్‌కి సరితూగే పోలికలు కనిపిస్తాయి. అందంగా కనిపించాలని ఇద్దరూ ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయంచుకున్నారు. ఇద్దరూ పుట్టింది ఆగస్టులోనే! స్లిమ్‌గా వుండాలని మైఖేల్‌ జాక్సన్‌ తిండి మానేసి కేవలం ట్యాబ్లెట్లతోనే కాలం గడిపాడు. శ్రీదేవి అందంగా కనిపించాలని బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌, లైపో సక్షన్‌, బొటాక్స్‌ వంటి బాహ్యసౌందర్య చికిత్సలు చేయించుకుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించింది. ఇద్దరూ రాత్రి సమయంలోనే మరణించారు. ఇదే యాదృచ్చికం. శ్రీదేవి మైఖేల్‌ జాక్సన్‌కు వీరాభిమాని.
  • శ్రీదేవి హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా సోల్వా సావన్‌ (1979) సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా గొప్పగా ఆడలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత జితేంద్ర సరసన ఆమె నటించిన హిమ్మత్‌వాలా (తెలుగులో ఊరికి మొనగాడు) సినిమా సూపర్‌ డూపర్‌ హట్టయింది. తర్వాత సంవత్సరం వచ్చిన తోఫా శ్రీదేవిని ఫిమేల్‌ సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది. జితేంద్రతో శ్రీదేవి 16 సినిమాల్లో నటించింది. వాటిలో జానీ దోస్త్, మవాలి, బలిదాన్, సుహాసన్, ఘర్‌ సంసార్‌, ఔలాద్ సినిమాలు బంపర్‌ హిట్లు. రాజేష్‌ ఖన్నాతో నయా కదం, మక్సద్‌, నజరానా, మాస్టర్జీ సినిమాలు సూపర్‌ హిట్లు. నాగినా సినిమాలో శ్రీదేవి స్నేక్‌ డ్యాన్సు అద్భుతమనే చెప్పాలి. ఫిరోజ్‌ ఖాన్‌ జాన్‌ బాజ్, మల్టి స్టారర్‌ సినిమా కర్మా శ్రీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.మొత్తం మీద శ్రీదేవి తెలుగులో 85, తమిళంలో 72, హిందీలో 71, మలయాళంలో 26, కన్నడంలో 6 సినిమాల్లో... మొత్తం మీద 300 పైచిలుకు సినిమాల్లో నటించింది. 15 ఏళ్ల విరామం తర్వాత ఆమె నటించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
    శ్రీదేవి
    శ్రీదేవి
    శ్రీదేవి
    శ్రీదేవి
    శ్రీదేవి
    శ్రీదేవి

ఇదీ చూడండి: రజనీకాంత్ కోసం ఉపవాసం చేసిన శ్రీదేవి?

ABOUT THE AUTHOR

...view details