పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టి, రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన బాబా జాక్సన్ మీకు గుర్తున్నాడా? లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఎందుకంటే అతడు ఇటీవలే ఓ రియాలిటీ షోలో పాల్గొని, ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించడం విశేషం.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్, లాక్డౌన్ వేళ 'ఎంటర్టైనర్ నంబర్.1' పేరుతో ఓ వర్చువల్ రియాలిటీ షోను నిర్వహించింది. కథానాయకుడు వరుణ్ ధావన్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మొత్తంగా ఎనిమిది వారాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చివరివరకు నిలిచిన యువరాజ్ సింగ్ అలియాస్ బాబా జాక్సన్.. కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు.