భాష... ప్రాంతం..మనుషులు... వాళ్ల అలవాట్లు వేర్వేరు కావొచ్చు కానీ భావోద్వేగాలు మాత్రం ఎక్కడైనా ఒక్కటే. - ఈ విషయమే చిత్ర పరిశ్రమల్ని పొరుగు కథలపై మక్కువ ప్రదర్శించేలా చేస్తుంది. ఓ తెలుగు సినిమా బాగా ఆడుతోందనే మాట వినిపిస్తే చాలు, పొరుగు చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు హైదరాబాద్‌లో వాలిపోతుంటారు. సినిమాల్ని చూసేసి, నచ్చితే నిర్మాతలతో బేరాలు మొదలుపెట్టేస్తారు. పక్క భాషల్లో బాగా ఆడే సినిమాలపై మనమూ అదే రకమైన ఆసక్తిని కనబరుస్తుంటాం. అందుకే కథల ఎగుమతులు, దిగుమతులు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా తెలుగులో పలువురు అగ్రహీరోలు రీమేక్‌లతోనే బిజీగా ఉన్నారు. వీటిలో ఈ వేసవిలో విడుదలయ్యేవే ఎక్కువ.
సురక్షితమైన ప్రయాణంగా భావించి రీమేక్‌లవైపు దృష్టిపెట్టేవాళ్లే ఎక్కువ. నిజానికి రీమేక్ అంత సురక్షితమేమీ కాదు. నేటివిటీ మొదలుకుని తారల ఇమేజ్ వరకు చాలా విషయాలు ఇందులో కీలకంగా మారిపోతుంటాయి. ఈమధ్యే '96'కు రీమేక్‌గా తెరకెక్కిన 'జాను'.. తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయింది. తమిళంలో మాత్రం '96' ఓ క్లాసిక్‌గా సినిమాగా నిలిచిపోయింది. ఇలా భారీ అంచనాలతో పునర్నితమైన చాలా సినిమాలు మన బాక్సాఫీసు ముంగిట తేలిపోయాయి. అయినా సరే... మంచి కథల్ని మనం చెబుదాం అనే ఉత్సాహంలో మన దర్శకనిర్మాతలు కనిపిస్తుంటారు. హీరోలూ ఆ కథల్ని బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంతోనే రీమేక్ సినిమాల జోరు తెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది.
'పింక్'తో పవన్... 'అసురన్'తో వెంకీ
వకీల్‌సాబ్ సినిమాలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రెండేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. మరోపక్క రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాడు కాబట్టి అందుకు తగ్గ కథ కావాలి. అందుకే బలమైన సామాజికాంశాలతో కూడిన 'పింక్' రీమేక్‌లో నటించడమే మేలని నమ్మాడు. అదే 'వకీల్ సాబ్'గా తెరకెక్కుతోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం 'పింక్'. తమిళంలో అజిత్.. ఈ సినిమా రీమేక్‌లో నటించి విజయాన్ని అందుకున్నాడు. ఇలా రెండు చోట్లా మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వేసవి సందర్భంగా మేలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీమేక్ సినిమాలు చేయడంలో ముందుండే మరో కథానాయకుడు వెంకటేశ్. ఆయన ఇప్పటివరకు 73 సినిమాలు చేయగా, అందులో 28 సినిమాలు రీమేక్‌లే. ప్రస్తుతం తెరకెక్కుతున్న 'నారప్ప' 29వ సినిమా కావడం విశేషం. తమిళంలో విజయవంతమైన 'అసురన్'కు రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం.
యువతరానిదీ అదే దారి
అగ్ర హీరోలకు సరైన కథలు దొరకడం కష్టం. వాళ్ల వయసు... ఇమేజ్ ఇలా చాలా కారణాలుంటాయి. అందుకే వాళ్లు రీమేక్‌లతో ప్రయాణం చేయాలని భావిస్తుంటారు. యువ కథానాయకులకి ఆ సమస్య లేకపోయినా ఈమధ్య వాళ్లూ పొరుగు కథలపైనే కన్నేస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'తడమ్'కు రీమేక్‌గా రామ్ 'రెడ్' తీస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. స్రవంతి రవికిశోర్ నిర్మాత. వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈమధ్యే 'భీష్మ'తో మళ్లీ విజయాలబాట పట్టిన నితిన్.. పొరుగు కథకు ఫిదా అయిపోయాడు. హిందీలో విజయవంతమైన 'అంధాదున్' రీమేక్‌లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. తెలుగులో రూపొందుతున్న మరో రీమేక్.. ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేస్తోంది. ఆ చిత్రం పేరు... 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'. మలయాళంలో విజయవంతమైన 'మహేషింతే ప్రతీకారమ్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. 'కేరాఫ్ కంచరపాలెం'తో తన ప్రతిభను నిరూపించుకున్న వెంకటేశ్ మహా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 'బాహుబలి' చిత్రాల తర్వాత ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో సత్యదేవ్ హీరో. వచ్చే నెల 17న రానుందీ చిత్రం.
తెలుగులో ఒకప్పుడు కథల కొరత ఉండేది. కానీ యువ దర్శకులు పోటాపోటీగా కొత్త ఆలోచనలతో వస్తున్నారు. అలా ఒకపక్క మనవైన కథల జోరు కొనసాగుతున్నప్పటికీ.. మరోపక్క పొరుగు కథలు అదేస్థాయిలో దిగుమతి అవుతుండడం విశేషం.