ప్రేమ గొప్పదైతే.. చరిత్రలో, సమాధుల్లో ఉండాలి గానీ.. పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని ఇంట్లో తిరుగుతుంటే ఎలా? ప్రేమ ఎప్పుడూ చరిత్రే... దానికి భవిష్యత్తు లేదు.
... ఇటీవల విడుదలైన 'ఉప్పెన' చిత్రంలోని మాటలు.
ప్రేమ చాలా గొప్పది.
చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు కాలాల్లోనూ ఉంటుందది. దాన్ని ద్వేషించే వారిని ఎందరినో మట్టిలో కలిపేసింది. అది ఎప్పుడూ ఒంటరిగా ఉండదు... జంటగానే తిరుగుతుంటుంది. ప్రేమ అనే పునాది పైనే ఎంతో మంది భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు. దానికి గమనమే కానీ... మరణమే లేదు.
... ఈ తరం యువత ప్రతిస్పందన ఇది.
ప్రేమంటే ఒకరి కోసం ఒకరు చావడం కాదు... ఒక్కటిగా జీవించడం. అందుకే ప్రేమ కావ్యాల్లో నిండిపోయి.. కథల్లో ఒదిగిపోయి... కవితల్లో ఇమిడిపోయి... నేటి తరం కోసం సినిమా పాటల్లో, మాటల్లో చిగురిస్తోంది. ప్రేమికుల హృదయాల్లో ముంచిన కలాలతో మన రచయితలు వీటికి ప్రాణం పోశారు. ఇటీవల కొన్ని సినిమాల్లోని ప్రేమ పాటలు... యూట్యూబ్‌లో కోట్ల మంది హృదయ స్పందనలై వికసిస్తున్నాయి.
ప్రేమ ఎంత అందమైందంటే... నువ్వు ఎక్కడుంటే అక్కడే స్వర్గాన్ని నేలకు దించుతుంది. అందుకే...
"ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోనే అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే" అంటూ 'శశి' లాంటి ప్రేమికుల మనసుల్లో వర్షమై కురుస్తుంది.
ప్రేమ దారులను పూల వనాలుగా మారుస్తుంది. అందుకే....
'నువ్వు నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే... నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే' అంటారు చంద్రబోస్ '30రోజుల్లో ప్రేమించడం ఎలా'గో చెబుతూ!