యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్తగా ఓ సినిమా ఒప్పుకున్నారంటే... ఇప్పుడు జాతీయ స్థాయిలో దాని గురించి చర్చ మొదలవుతుంది. తెలుగు కథానాయకుడే అయినా.. పాన్ ఇండియా స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. తెలుగులో ప్రయాణం మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగారు. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోని అన్ని భాషల్లోనూ ఆయనకి అభిమానులున్నారు. ఒక స్టార్‌గా సత్తా చాటారు. నటుడిగానూ నిరూపించుకున్నారు. బుధవారంతో 18 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన.
ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' 2002, నవంబర్ 11న విడుదలైంది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో, మూడు పాన్ ఇండియా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటి గురించి జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినీ మార్కెట్ పాలిట ప్రభాస్ నిజంగానే ఇప్పుడొక బాహుబలి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రభాస్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు ప్రభాస్.