Real Story Movies: అంతర్జాలం.. ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. ప్రపంచ సినిమాలకు బాగా అలవాటు పడటంతో.. అందుకు తగ్గట్లుగా మన కథల్లోనూ మార్పులు కోరుకుంటోంది ప్రేక్షక లోకం. కృతిమ కథలు, తర్కానికి అందని కథాంశాలను చూడటం కంటే.. వాస్తవికత ఉట్టిపడే సినిమాల్ని చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన ఈ మార్పుల్ని గమనించే సినీ రచయితలు, దర్శకులు ఆ తరహా కథలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే యావత్ దేశాన్ని కదిలించిన అనేక యథార్థ గాథలు వెండితెరపైకి దృశ్య కావ్యాలుగా వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు వాస్తవ సంఘటనలతో ఇప్పటికే వెండితెరపై అనేక సినిమాలొచ్చాయి. 90ల్లో దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన 'రోజా', 'బొంబాయి' సినిమాలకు ఈ తరహా కథాంశాల స్ఫూర్తిగా నిలిచాయి. కశ్మీర్ తీవ్రవాద సమస్యను ఓ ప్రేమకథ కోణంలో నుంచి 'రోజా'లో కళ్లకు కట్టినట్లు చూపించారు మణిరత్నం. ఇది అప్పట్లో బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకొంది. ఇక 1995లో వచ్చిన 'బొంబాయి' దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ముంబయిలో చెలరేగిన మతకలహాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ సున్నితమైన అంశాన్ని ఓ అందమైన ప్రేమకథతో ముడిపెడుతూ 'బొంబాయి'ని తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పించింది. అప్పట్లో ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో వివాదాలు చెలరేగాయి. అయితే వీటన్నింటినీ దాటుకొని సినిమా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవల కాలంలో ఈతరహా చిత్రాలకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన సినిమా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'. విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. 2016 నాటి ఉరీ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ముష్కర మూకలపై భారత ప్రభుత్వం పారా స్పెషల్ ఫోర్సెస్‌తో మెరుపు దాడులు చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన చిత్రమే 'ఉరి'. 2019 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు నాలుగు జాతీయ అవార్డులను అందుకొంది. రూ.25కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లో దాదాపు రూ.342కోట్ల వసూళ్లు సాధించడం విశేషం.
ఆ బాటలో 'స్టేట్ ఆఫ్ సీజ్'
భారత సైన్యం చేపట్టిన ఓ రియల్ ఆపరేషన్ ఆధారంగా రూపొందిన చిత్రం 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్'. 'స్టేట్ ఆఫ్ సీజ్: 26/11 అటాక్'కు కొనసాగింపుగా రూపొందింది. అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. కెన్ ఘోష్ తెరకెక్కించారు. 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ దేవాలయంపై జరిగిన దాడి.. ఆ దాడికి సంబంధించిన నేరస్థులను తుదముట్టించడానికి ఎన్‌ఎస్‌జీ కమాండోలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందింది. గతేడాది జులై 9న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5'లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.
ఇదే బాటలో 'మేజర్' చిత్రం రూపొందుతోంది. అడివిశేష్ కథానాయకుడిగా 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన ఈ ఘటనపై తెరకెక్కిస్తున్నారు. మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.