"ప్రేక్షకులు కరోనా తర్వాత ఓటీటీలో ప్రపంచ సినిమా మొత్తాన్ని చూసి మరింత చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్లకి ఇప్పుడు వినోదం పంచాలంటే సినిమాలో ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉండాల్సిందే. అందుకు తగ్గట్టే మా సినిమా రూపొందింది" అన్నారు కథానాయకుడు విష్ణు విశాల్. తమిళంలో వరుస విజయాలు అందుకుంటున్న కథానాయకుడీయన. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలని వివాహం చేసుకుని తెలుగింటి అల్లుడు అయ్యారు. విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం 'ఎఫ్.ఐ.ఆర్'. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా విష్ణు విశాల్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"తెలుగు ప్రేక్షకులు అటు వాణిజ్య, ఇటు కంటెంట్ ప్రధానమైన చిత్రాలు.. రెండింటినీ ఆదరిస్తుంటారు. అందుకే నా భార్య జ్వాల 'రాక్షసన్' చూశాక 'చాలా బాగుంది, నువ్వు దీన్ని తెలుగులో విడుదల చేయాల్సిందే' అని పట్టుబట్టింది. కుదరలేదు. ఆ తర్వాత అది 'రాక్షసుడు'గా తెలుగులో రీమేక్ అయ్యి విజయవంతమైంది. 'ఎఫ్.ఐ.ఆర్' సినిమాని చూశాక మళ్లీ జ్వాల చెప్పింది. ఎలా విడుదల చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా భార్య స్నేహితురాలు శ్వేత.. రవితేజ దగ్గర పని చేస్తుంటారు. ఆమెతో మాట్లాడాక రవితేజ దగ్గరికి వెళ్లా. నేను ఆయన సినిమాలు చూశాను కానీ, వ్యక్తిగతంగా కలవడం అదే తొలిసారి. కానీ ఎప్పట్నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా నాతో మాట్లాడారు. మీలా నేను మాస్ హీరో కావాలని అనుకుంటున్నానని నేనంటే, ఆయన నీలాంటి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నా అన్నారు. అలా మామధ్య సరదా సంభాషణ సాగింది. ఆ తర్వాత మా ప్రాజెక్ట్ గురించి చెప్పి, సినిమా చూపించాం. ఆయనకు నచ్చి దీన్ని సమర్పించేందుకు ముందుకొచ్చారు. ఇదే నెలలోనే ఆయన నటించిన 'ఖిలాడి' విడుదలవుతున్నా, 'ఏం పర్వాలేదు, నేను నటించిన సినిమా అది, ఇది సమర్పిస్తున్న సినిమా. పోస్టర్‌పై నా పేరు వేయండి' అంటూ భుజం తట్టారు. ఆ తర్వాత అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటివరకు నా కెరీర్‌లోనే అత్యధిక వ్యాపారం చేసిన సినిమా ఇదే. తప్పకుండా ప్రేక్షకుల్నీ మెప్పిస్తుంది".