తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమీక్ష: 'ఆవిరి'లో భయం కంటే థ్రిల్ ఎక్కువ..! - ravibabu cinema

రవిబాబు నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'ఆవిరి'. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా... శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్రం ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం!

సమీక్ష: 'ఆవిరి'లో భయం కంటే థ్రిల్ ఎక్కువ..!

By

Published : Nov 1, 2019, 6:30 PM IST

వినోదాత్మక చిత్రాలతో దర్శకత్వ కెరీర్ ప్రారంభించి.. విభిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. అతడు నటించి దర్శకత్వం వహించిన ‘ఆవిరి’ నేడు విడుదలైంది. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నివాసంపై వచ్చిన వార్తల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు రవిబాబు ఇప్పటికే చెప్పాడు. మరి ఈ థ్రిల్లర్‌ ఎంతగా ఆకట్టుకుంది? పందిపిల్ల ప్రధాన పాత్రలో రవిబాబు తీసిన 'అదుగో' పరాజయం తర్వాత ఇది ఆయన కెరీర్‌లో హిట్‌గా నిలిచిందా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

క‌థలోకి వెళ్తే..

రాజ్ (ర‌విబాబు), లీనా (నేహా చౌహాన్‌) భార్యాభ‌ర్త‌లు. వాళ్ల‌కిద్ద‌రు పిల్ల‌లు. శ్రేయ‌, మున్ని. వీరిద్ద‌రూ ఆస్తమాతో బాధ‌ప‌డుతుంటారు. ఆ కార‌ణంతోనే శ్రేయ కూడా చ‌నిపోతుంది. ఆ బాధ‌లో భార్యాభ‌ర్త‌లు ఇల్లు మార‌తారు. అక్క‌డికి వెళ్లాక మున్ని విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెడుతుంది. ఓ అజ్ఞాత‌, అదృశ్య వ్య‌క్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఇల్లు వ‌దిలి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించినా ఓసారి ఇంట్లోంచి మాయ‌మైపోతుంది. మున్ని ఎక్క‌డికి వెళ్లింది.? మున్ని మాట్లాడుతున్న ఆ అదృశ్య శ‌క్తి ఎవ‌రు? అనేది తెలియాలంటే ‘ఆవిరి’ చూడాలి.

ఎలా ఉందంటే..

నిజానికి ఇది హార‌ర్ సినిమా కాదు. ఆ ల‌క్ష‌ణాలు ఉన్న థ్రిల్ల‌ర్ అనుకోవ‌చ్చు. ర‌విబాబు క‌థ క‌న్నా క‌థ‌నంపైనే దృష్టి పెట్టాడు. ఓ బిడ్డ‌ని కాపాడుకోవ‌డానికి తల్లిదండ్రులు ప‌డే త‌ప‌న‌, ఆ ఇంట్లోంచి పారిపోవాల‌ని చూసే కూతురు.. వీటి మధ్య ఓ అదృశ్య శ‌క్తి... ఇలా క‌థ‌నం ఆస‌క్తిగానే న‌డిపించాడు. అరె... భ‌లే ఉందే అనే స‌న్నివేశాలేం ఉండ‌వు. అలాగ‌ని బోర్ కూడా కొట్టించ‌లేదు. స‌న్నివేశాల‌న్నీ అలా అలా న‌డుస్తుంటాయి. భ‌యం కంటే ఉత్కంఠ‌ క‌లిగించ‌డంపైనే దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. అందులో కొన్ని కొన్నిసార్లు విజ‌య‌వంతం అయ్యాడు. ఇంకొన్ని సార్లు త‌డ‌బ‌డ్డాడు. విశ్రాంతి వ‌ర‌కూ క‌థంతా కేవ‌లం ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంటుంది.

ఆవిరి

అస‌లు ఇంట్లో ఏం జ‌రుగుతుంది? ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శ‌క్తి ఎవ‌రు? అనే విష‌యాలు చివ‌రి వ‌ర‌కూ గోప్యంగా ఉంచాడు. ఒక్క‌సారి ఆ విష‌యం తెలిసిపోతే క‌థ‌లో థ్రిల్ మిస్స‌వుతుంద‌ని, చెప్ప‌డానికి ఏమీ ఉండ‌ద‌ని ర‌విబాబు భావించి ఉంటాడు. గుప్పెట విప్ప‌గానే... సినిమా కూడా చ‌క చ‌కా అయిపోయింది. విశ్రాంతి నుంచి ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ క‌థ‌ని న‌డ‌ప‌డంలో ఇబ్బంది ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. రెండు మూడు పాత్ర‌ల చుట్టూ సాగే సినిమా కావ‌డం, ఒకే లొకేష‌న్ క‌నిపిస్తుండ‌డం కాస్త విసుగు క‌లిగిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు మ‌రీ సుదీర్ఘంగా అనిపిస్తాయి. ర‌విబాబు ఆఫీసు వ్య‌వ‌హారాలు, రిపీటెడ్‌గా క‌నిపించే దృశ్యాలు ట్రిమ్ చేసుకుంటే బాగుండేది. చివ‌రి 10 నిమిషాలూ మ‌ళ్లీ ట్రాక్ ఎక్క‌డం వల్ల సినిమా ఓకే అనిపిస్తుంది

ఎవ‌రెలా చేశారంటే..

త‌న‌కు సూట‌య్యే పాత్ర‌లో కనిపించినర‌విబాబు న‌టుడిగానూ ఆక‌ట్టుకున్నాడు. కాస్ట్యూమ్స్ కూడా హుందాగా ఉన్నాయి. వ్యాపారవేత్తగా, ఓ భ‌ర్త‌గా రెండు పార్శ్వాల్లోనూ రాణించాడు. పాప‌గా క‌నిపించిన బాల న‌టి మెప్పించింది. క‌ళ్ల‌తో హావ‌భావాలు ప‌లికించింది. మాన‌సిక వైద్యుడిగా భ‌ర‌ణి శంక‌ర్ కూడా ప‌రిధి మేర న‌టించాడు. కాశీ విశ్వ‌నాథ్ ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించారు. మిగిలిన వారెవ్వ‌రికీ పెద్ద‌గా స్కోప్ లేదు.

క‌ళా ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం న‌చ్చుతుంది. ఈ సినిమాకి వాడిన క‌ల‌ర్ విధానం కంటికి ఇంపుగా ఉంది. కెమెరా ప‌నిత‌నం కూడా బాగుంది. అక్క‌డ‌క్క‌డ నేపథ్య సంగీతంతో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం జరిగింది. ర‌విబాబు మంచి టెక్నీషియ‌న్‌. మంచి క‌థ ఎంచుకుంటే త‌ప్ప‌కుండా విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అందించ‌గ‌ల‌డు. ఈసారి క‌థ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటే బాగుంటుంది.

బ‌లాలు

  • ఉత్కంఠ‌ క‌లిగించిన ప్ర‌థమార్ధం
  • కథనం

బ‌ల‌హీన‌త‌లు

  • సాగదీతగా అనిపించే ద్వితీయార్ధం
  • ఒకే పాయింట్‌ చుట్టూ తిరగడం

చివ‌రిగా: ఆవిరి... భ‌యం త‌గ్గినా, థ్రిల్ బాగుంది!

ఇదీ చదవండి: సమీక్ష : 'మీకు మాత్రమే చెప్తా' ఎలా ఉందంటే..

ABOUT THE AUTHOR

...view details