రివ్యూ: ఆ మూడు లక్ష్యాలను 'సుల్తాన్' సాధించాడా? - రష్మిక కార్తి సుల్తాన్ మూవీ రివ్యూ
తమిళ హీరో కార్తి, హీరోయిన్ రష్మిక నటించిన సినిమా 'సుల్తాన్'. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు ఈ సినిమా కథేంటి? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.
వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ తమిళ్‌కు దీటుగా తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న కథానాయకుడు కార్తి. ఆ మధ్య వరుస పరాజయాలతో కాస్త డీలా పడినా.. చినబాబు, ఖైదీ, దొంగ వంటి హిట్లతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కారు. ఇప్పుడా విజయపరంపరను 'సుల్తాన్'తో కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. కౌరవుల పక్షాన నిలిచే కృష్ణుడి కథ అంటూ టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. మరి ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? సుల్తాన్‌గా కార్తి సందడి సినీ ప్రియుల్ని మెప్పించిందా?
కథేంటంటే: విక్రమ్ అలియాస్ సుల్తాన్ (కార్తి) ఓ రోబోటిక్ ఇంజినీర్. ముంబయిలో చదువు పూర్తి చేసుకున్న తను.. జపాన్ వెళ్లి సొంతంగా ఓ రోబోటిక్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి వెళ్లాలని సొంతూరు విశాఖపట్నం వస్తాడు. సుల్తాన్ తండ్రి సేతుపతి (నెపోలియన్) విశాఖలో పేరు మోసిన రౌడీ నాయకుడు. ఆయన దగ్గర 100మంది కౌరవ సైన్యం ఉంటుంది. అవసరాన్ని బట్టీ సుపారీలు తీసుకొని మర్డర్‌లు చేయడం వారి పని. సుల్తాన్‌కి ఈ రౌడీయిజాలు, రక్తపాతాలు ఏమాత్రం నచ్చవు. అందుకే సేతుపతి తన బిడ్డని వీటన్నింటికీ దూరంగా పెంచుతాడు. కానీ, అనుకోని పరిస్థితుల్లో తండ్రిని పోగొట్టుకోవడంతో ఆ కౌరవ సైన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సుల్తాన్‌పై పడుతుంది. అయితే అతని ముందు మూడు సవాళ్లు ఉంటాయి. ఓవైపు తన కౌరవ సైన్యాన్ని రౌడీయిజానికి దూరంగా ఉండేలా చూసుకుంటూనే.. వెలగపూడిలో అరాచకాలు సృష్టిస్తున్న జయేంద్ర (రామచంద్రరాజు) నుంచి ఆ గ్రామ ప్రజల్ని కాపాడి, అక్కడి భూముల్ని వారికి తిరిగి ఇప్పించడం. మూడోది రుక్మిణి (రష్మిక) ప్రేమను దక్కించుకోవడం. మరి ఈ మూడు లక్ష్యాలు సాధించడానికి సుల్తాన్ చేసిన పనులేమిటి? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? ఆఖరికి తను అనుకున్నది సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
సుల్తాన్
ఎలా ఉందంటే: కార్తి ప్రీరిలీజ్ వేడుకలు.. ఇంటర్వ్యూల్లో చెప్పినట్లు ఇది పూర్తి మాస్ మసాలా ఎంటర్‌టైనర్. భారతంలో కృష్ణుడు కౌరవుల పక్షాన నిలిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు భాగ్యరాజ్ ఈ కథ అల్లుకున్నారు. ఓవైపు 100 మంది కౌరవ సైన్యం.. ఆ సైన్యానికి కృష్ణుడిలా అండగా నిలిచే ఓ హీరో.. మరోవైపు ఆ కృష్ణుడికి, ఆ రాక్షస సైన్యానికి సవాల్ విసిరే మరో రావణ సైన్యం.. వీటి మధ్య ఓ అందమైన ప్రేమకథ. పైకి ఓ కథలా అనిపిస్తున్నా.. ఒకదానితో ముడిపడి మరికొన్ని ఉపకథలు కనిపిస్తుంటాయి. ఇది వినడానికి కథ ఎంత కొత్తగా ఉందో.. అందులోని సంక్లిష్టత అంతే ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి కథల్ని తెరపై చక్కగా ఆవిష్కరించగలగడం ఏ దర్శకుడికైనా సవాలే. దీన్ని దర్శకుడు భాగ్యరాజ్ ప్రధమార్ధంలో చక్కగానే డీల్ చేశారు. ఆరంభంలో సుల్తాన్ బాల్యం.. తండ్రి సేతుపతి కౌరవ సైన్యం శక్తిసామర్థ్యాలు.. ఆ సైన్యంతో కార్తికున్న అనుబంధాలను చూపిస్తూ.. సినిమాకు చక్కగా ప్రారంభించారు. తర్వాత తండ్రి మరణం.. ఈ క్రమంలో ఆయనకిచ్చిన మాట కోసం ఆ రౌడీ సైన్యానికి సుల్తాన్ నాయకత్వం వహించాల్సి రావడం.. మరోవైపు విశాఖ ఎస్పీ నుంచి తన సైన్యాన్ని కాపాడుకోవడం కోసం అతను వేసే ఎత్తులతో కథను చకచకా పరుగులు పెట్టించారు. ఇక కథ అమరావతికి షిఫ్ట్ అయ్యాక.. కథలో ప్రేమ కోణంతో పాటు మరో ఆసక్తికర పోరును బయటకి తీశారు దర్శకుడు. కార్తి ఓవైపు తన కౌరవ సైన్యాన్ని కత్తిపట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూనే.. రష్మికతో ప్రేమను పట్టాలెక్కించేందుకు నానా తంటాలు పడుతుంటాడు. మరోవైపు ఆ కౌరవ సైన్యం కార్తికి తెలియకుండా రామచంద్రరాజును మట్టుబెట్టే ప్రణాళిక రచిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ రసవత్తరంగా సాగుతుంటాయి. ఇక మధ్య మధ్యలో కార్తికి, కింగ్‌కాంగ్ (యోగిబాబు)కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కాస్తంత వినోదాన్ని పంచుతుంటాయి. సరిగ్గా విరామ సమయానికి కార్తి.. రామచంద్రరాజుతో తలపడాల్సి రావడం.. ఈ క్రమంలో జరిగే ఓ శక్తిమంతమైన యాక్షన్ హంగామాతో ప్రధమార్ధానికి ఊపునిచ్చే ముగింపునిచ్చారు.
సుల్తాన్
నిజానికి ప్రధమార్ధంలో కార్తి.. రామచంద్రకు చెక్ చెప్పడంతోనే ఈ కథలో ఓ అంకానికి ముగింపు పడినట్లే అనుకుంటారు. కానీ, అక్కడ కథ మరో మలుపు తీసుకుంటుంది. అతని వెనకున్న మరో పెద్ద రావణుడితో కార్తి తలపడాల్సి వస్తుంది. మరోవైపు తన ప్రేమ కోసం, తన కౌరవ సైన్యాన్ని కాపాడుకోవడం, వెలగపూడి గ్రామ భూముల్ని కాపాడుకోవడం కోసం వ్యవసాయం చేయాల్సి రావడం.. ఈ క్రమంలో తనకెదురయ్యే సవాళ్లతో ద్వితీయార్ధం కాస్త గందరగోళంగా సాగుతున్నట్లు అనిపిస్తుంటుంది. నిజానికి దర్శకుడు ఒకేసారి ఇన్ని అంశాలపై దృష్టి పెట్టే క్రమంలో అసలు కథనాన్ని పూర్తిగా పక్కదారి పట్టించాడనిపిస్తుంది. కాసేపు ప్రేమ సన్నివేశాలు.. మరికాసేపు ప్రతినాయకుడితో సవాళ్లు విసరడం.. ఇంకాసేపు తన సైన్యాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలతో.. కథను భారంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఆఖరికి ముగింపుపై ప్రభావం చూపించింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని ముగించిన తీరు ప్రేక్షకులకు సంతృప్తిని అందించదు.
సుల్తాన్
ఎవరెలా చేశారంటే: కార్తి సుల్తాన్ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయారు. సినిమా ఆద్యంతం ఓ చక్కటి ఎనర్జీని చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయనలోని హీరోయిజం మరోస్థాయిలో ఉంటుంది. రష్మిక పల్లెటూరి అమ్మాయి రుక్మిణి పాత్రలో అందం, అభినయాలతో ఆకట్టుకుంది. అయితే కార్తికి, ఆమెకి మధ్య కెమిస్ర్టీని ఆకట్టుకునేలా ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడ్డారు. ఆయన ఎంచుకున్న కథ ఆసక్తికరంగా ఉన్నా.. దాన్ని రసవత్తరంగా ముందుకు నడిపించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో తమిళ వాసన కనిపిస్తుంటుంది. అయితే ఆయన యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాస్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. రూబెన్ ఎడిటింగ్ పరంగా మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. డ్రామా కోసం అనవసరమైన ఎపిసోడ్లు చాలా పేర్చుకుంటూ పోయారు. వాటిని కత్తిరించి ఉంటే.. ప్రేక్షకులకు కాస్త ఉపశమనం దక్కేది. వివేక్ మెర్విన్ పాటలు వినసొంపుగానే ఉన్నా.. పెద్దగా గుర్తుపెట్టుకునేలా ఉండవు. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నిలిచింది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం ఆకట్టుకునేలా ఉంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
బలహీనతలు
+ కథ
- సినిమా నిడివి
+కార్తి నటన
-ద్వితీయార్ధం, క్లైమాక్స్
+ప్రధమార్ధం, యాక్షన్ సన్నివేశాలు
ివరిగా: మాస్ ప్రేక్షకులను మెప్పించే సుల్తాన్
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.