టాలీవుడ్లో తనదైన అందం, అభినయంతో అవకాశాలు దక్కించుకుంటోంది నటి రష్మిక. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరోన నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఓ సినిమాను ఎంపిక చేసుకోవాలంటే తనను ఆకర్షించే విషయాలేంటని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పింది.
'ఆ రెండూ ఉంటే చాలు కథకు గ్రీన్ సిగ్నల్' - రష్మిక ఇంటర్వ్యూ
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి రష్మిక. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఓ కథను ఎంపిక చేసుకోవడానికి తనను ఆకర్షించే విషయాలేంటనే దానిపై తాజాగా స్పందించిందీ ముద్దుగుమ్మ.
"నేనొక కథను ఎంచుకునే ముందు అందులో నా మనసుకు నచ్చిన రెండు అంశాలు ఉన్నాయా? లేదా? అని క్షుణ్నంగా పరిశీలిస్తా. అందులో ఒకటి భావోద్వేగం రెండోది వినోదం. నేనొక చిత్రాన్ని ఎంచుకున్నానంటే ఆ చిత్ర కథ, నా పాత్ర ద్వారా పండించే భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేవిగా ఉండాలి. లేదంటే సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతూనైనా ఉండాలి. నా తొలి చిత్రం నుంచి స్క్రిప్ట్ ఎంపికలో నేను పాటిస్తున్న సూత్రమిది. ఇదే నా విజయ రహస్యం కూడా. నా తొలి చిత్రం 'ఛలో' ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, తర్వాత నేను చేసిన 'గీత గోవిందం' వినోదాన్ని అందిస్తూనే చక్కటి భావోద్వేగాలతో సినీ ప్రియులను మెప్పించింది. ఈ రెండింటి తర్వాత నా నుంచి వచ్చిన 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' చిత్రాల్లోనూ నేను పైన చెప్పిన రెండు అంశాలే కీలకంగా ఉంటాయి" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.