కరోనా సంక్షోభం నుంచి మన ఆలోచనలను, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పుస్తకాలు చదవండి అంటోంది నటి రాశీఖన్నా. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టా వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న దానిపై తనదైన శైలిలో సూచనలు చేసింది.
శ్రుతిమించితే ఏదైనా ముప్పే: రాశీ - రాశీ ఖన్నా న్యూస్
కరోనా లాక్డౌన్లో కాలక్షేపానికి పుస్తకాలను చదవమంటోంది నటి రాశీ ఖన్నా. ప్రజలంతా తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలంటోంది. దాని కోసం ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలని చెబుతోంది.
"ఈ సమయంలో కరోనా వార్తలు అదే పనిగా చూడటం వల్ల బుర్రలో ఆలోచనలు పాడైపోయే ప్రమాదం ఉంది. మెదడుపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. కాబట్టి అతిగా టీవీలకే అతుక్కుపోకండి. సమాచారం తెలుసుకోవడం ముఖ్యమే కానీ, శ్రుతిమించిన స్థాయిలో సమాచారాన్ని బుర్రలో నింపుకోవడమూ ప్రమాదమే అని గుర్తుంచుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ సమయంలో సానుకూల ప్రభావాన్ని, స్ఫూర్తిని రగిలించే పుస్తకాలు చదవండి. ప్రస్తుతం ఇంట్లో నేనూ ఇదే పని చేస్తున్నా. యోగా, ధ్యానం చెయ్యండి. దీని వల్ల ప్రశాంతత దక్కడం సహా మీ అందం, ఆరోగ్యం చక్కగా ఉంటాయి. నా అందం రహస్యం కూడా ఇదే. వీలైనంత వరకు చుట్టు పక్కల ఉన్న అన్నార్థులకు మీ వంతు సహాయాన్ని అందించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. ప్రస్తుతం నేను ఈ విరామ సమయంలో చిన్న చిన్న వంటలు చేస్తున్నా. అది చూసి మా అమ్మానాన్న చాలా సంతోష పడుతున్నారు" అని చెప్పుకొచ్చింది రాశీ.
ఇదీ చూడండి.. ఒంటిని విల్లులా వంచుతున్న 'సాగరకన్య'