సూర్యుడికి ఎదురుగా డాబామీద నిల్చుని జరీపంచే మీద సిల్కు లాల్చీ, దానిమీద కండువా వేసుకుని ఠీవిగా తల పైకెత్తి, నారాయుడనేవాణ్ణి హత్యచేయించి, శవాన్ని కారు డిక్కీలో తేసుకొచ్చిన సెక్రటరీతో "అబ్బా సెగెట్రీ ! ఎప్పుడూ పనులూ, బిగినెస్సేనా. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయుడి సేవ జేసుకోవద్దూ. కళ్లెట్టుకు సూడు. పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశంలో. సూరీడు నెత్తురు గడ్డలా లేడూ. ఆ.. మడిసన్నాక కాసింత కళాపోసనుండాలయ్యా. ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది".. అప్పట్లో ముత్యాలముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టరు అచ్చమైన గోదావరి గ్రామీణ మాండలికంలో చెప్పే మార్మోగిపోయిన డైలాగు ఇది. ఈ కాంట్రాక్టరు సంభాషణలతో విడుదలైన ఎల్.పి. రికార్డులు, ఆడియో క్యాసెట్లు ఆ రోజుల్లో విపరీతంగా అమ్ముడుపోయాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ సంభాషణల సృష్టికర్త ముళ్లపూడి వెంకట రమణయితే, అంత ప్రత్యేకంగా వాటికి శబ్దరూపం కలిపించింది రావు గోపాలరావు అనే రంగస్థల నటుడు.
భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' అనే సాంఘిక నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించిన ఈ రంగస్థల నటుడు.. చాలా ప్రశంసలు అందుకున్నారు. మద్రాసులో జైహింద్ మన సత్యం కీర్తిశేషులు సహాయనిధ కోసం ఆ నాటకాన్ని ఏర్పాటు చేసినప్పుడు చలనచిత్ర పరిశ్రమ అతణ్ణి గుర్తించింది. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి అడుగిడినవాళ్లు తొందరలోనే రాణిస్తారు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ రావు గోపాలరావు. అచిరకాలంలోనే చలనచిత్ర ప్రవేశం చేసి అటు విలనీ తోబాటు మంచి హాస్యాన్ని కూడా మేళవించి గోపాలరావు ప్రేక్షకులను సమ్మోహనపరచారు. కానీ పిన్నవయస్సులోనే ఆగస్టు 13, 1994న 57 ఏళ్లకే అకాల మరణం చెందడం దురదృష్టం. ఈరోజు రావు గోపాలరావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆ విశిష్ట నటుడి గురించి కొన్ని విశేషాలు.
రంగస్థలం నుంచి ఎదిగి...
రావు గోపాలరావు కాకినాడ కు సమీపంలో వుండే గంగనపల్లి గ్రామంలో జనవరి 14, 1937 న సంక్రాంతి పర్వదినాన జన్మించారు. రావు సత్యనారాయణరావు, సీతాయమ్మ ఆయన తల్లిదండ్రులు. మొదటినుంచి నాటకాలంటే గోపాలరావుకు విపరీతమైన ఆసక్తి. అతని స్నేహితులు గోపాలరావును బాగా ప్రోత్సహించేవారు. అతడు నటించిన “ధన్యజీవులు” అనే నాటకం గోపాలరావుకు మంచి పేరుతెచ్చి పెట్టడంతో ఆయన నాటకాల వైపు మొగ్గు చూపారు. దాంతో “అసోసియేటెడ్ అమెచూర్ డ్రామా కంపెనీ” అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేకచోట్ల ప్రదర్శించారు. ఆరోజుల్లో కోస్తా జిల్లాలలో పండగలకు, పబ్బాలకు పరిషత్ నాటక పోటీలు విస్తృతంగా జరిపేవారు. గోపాలరావు పరిషత్ నాటకాలకు వస్తే అతనికే ఉత్తమ నటుడి బహుమతి దక్కేది. నటసార్వభౌముడు ఎస్.వి. రంగారావును, దర్శకుడు రామినీడును సన్మానించాలని గోపాలరావు స్నేహితులు రాజమహేంద్రవరంలో ఒక సభను ఏర్పాటుచేసి, అందులో “కీర్తిశేషులు” నాటకాన్ని ప్రదర్శించారు. అందులో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధులైన రామినీడు, గోపాలరావు వును మద్రాసుకు పిలిపించారు. ఇందులో ఎస్.వి. రంగారావు ప్రమేయం కూడా వుంది. రామినీడు దర్శకత్వం వహించిన “భక్తపోతన”(1966) సినిమాలో రంగారావుది శ్రీనాధుని పాత్ర.
అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టముంది. ఆసందర్భంగా శ్రీనాధుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టాలి. ఎవరికంటే వాళ్లకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావు ను పిలిపించి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టారు. అలా రంగారావు ఆశీస్సులు పొందే అవకాశం గోపాలరావుకు దక్కింది. రామినీడు అతనిలో వున్న ‘స్పార్క్’ ను గమనించి “భక్త పోతన” సినిమాకు సహాయ దర్శకునిగా గా కూడా అవకాశం కలిపించారు. రామినీడుకు గోపాలరావు నటనతోబాటు అతని ప్రవర్తన కూడా నచ్చడంతో తరవాత నిర్మించిన “బంగారు సంకెళ్ళు”(1968), “మూగప్రేమ”(1971) సినిమాలకు కూడా గోపాలరావునే సహాయ దర్శకునిగా నియమించారు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ కీర్తిశేషులు నాటకం చూసి, రావు గోపాలరావు కు “జగత్ కిలాడీలు” (1969) లో ప్రధాన విలన్ పాత్రను పోషించే అవకాశం ఇచ్చారు. అయితే గోపాలరావు వాయిస్ అతనికి నచ్చక వేరేవారితో డబ్బింగ్ చెప్పించారు. తదనంతర కాలంలో అదే వాయిస్ రికార్డులు సృష్టిస్తుందని బహుశా రాఘవ ఊహించి వుండరు. అయితే కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన “గండర గండడు” (1969) సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషింఛిమెప్పించారు.
ముత్యాలముగ్గుతో తిరుగులేని స్టార్ గా...
బాపు-రమణల మాగ్నం ఓపస్ “ముత్యాలముగ్గు” (1975). అది బాపు-రమణల నిర్మాణ ప్రతిభకు ఓ మైలు రాయైతే, రావు గోపాలరావుకు ఓ కలికితురాయి. ఉత్తర రామాయణ కథను అంతర్లీనంగా ఉండేలా రూపొందించిన ఈ సినిమాలో గోపాలరావు ఓ విలక్షణ విలన్ అవతారమెత్తారు. సిల్కు లాల్చీ, ఉత్తరీయం, పంచెకట్టు, ఫ్రెంచ్ కటింగ్ మీసాలతో ఓ మోతుబరి ఆసామిలా కనిపిస్తూ, వెన్నపూసిన కత్తిలాంటి విలనీ అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా వందరోజుల పండగ చేసుకున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా విజయంతో గోపాలరావు స్టార్డం ఆకాశాన్నంటింది. ఎక్కువగా పులిదిండి అవుట్ డోర్, హైదరాబాద్ జ్ఞాన్ భాగ్ ప్యాలెస్ లో నిర్మించిన ఈ సినిమా బాపు-రామణలకే కాకుండా గోపాలరావుకు అఖండ కీర్తిని ఆర్జించిపెట్టింది. ఈ సినిమా తరవాత గోపాలరావు తెలుగు సినిమా విలనీకి ఓ కొత్త రూపునిచ్చారు. “వేటగాడు” సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. “మనవూరి పాండవులు” సినిమాలో విలనీ మరో రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. ఆరోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందిన విషయం మరువరానిది. “గోపాలరావు గారి అమ్మాయి” సినిమా ఆయన పేరుతోనే రావడం రావు గోపాలరావు కు సినిమా రంగంలో వున్న ప్రత్యేకతను తెలియజేసింది.
గోపాలరావు సహ కళాకారిణిని వివాహమాడడం కూడా ఆయన కళలకు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది. ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి. కాకినాడ సూర్యకలా మందిరంలో ఆమె హరికథా కాలక్షేపం చేస్తుండగా, ఆ కార్యక్రమానికి హాజరైన గోపాలరావు ఆమెమీద మనసు పారేసుకున్నారు. తరవాత రాజమహేంద్రవరం లలితా కళా నికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే ఇద్దరూ 1966లో ఒక ఇంటివారైనారు. కమలకుమారి ఈ మధ్యనే హైదరాబాదులో కాలం చేశారు. బాపు దర్శకత్వంలోనే వచ్చిన భక్తకన్నప్ప, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, బులెట్, జాకీ సినిమాలలో రావు గోపాలరావు తన నటనను విభిన్నంగా ప్రదర్శించడం విశేషం. కొండవీటి సింహం, మగధీరుడు, కిరాయిరౌడీలు, జస్టిస్ చౌదరి, కటకటాల రుద్రయ్య, కొండవీటి రాజా, మగధీరుడు, ఘరానా మొగుడు, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, యమగోల, అభిలాష, దేవాలయం, అనుగ్రహం, అల్లరిప్రియుడు, ఖైదీ సినిమాలలో గోపాలరావు నటన అద్భుతంగా వుంటుంది. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించారు. “రావు గోపాలరావు” సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, “పట్నం వచ్చిన పతివ్రతలు”, “మల్లెపువ్వు” సినిమాల్లో మాలిష్ మారాజుగా, “మావూర్లో మహా శివుడు” సినిమాలో శివుడుగా, “స్టేషన్ మాస్టర్” సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా “ఇంటిదొంగ” సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు.
మరపురాని గోపాలరావు డైలాగులు కొన్ని...
“ముత్యాలముగ్గు”లో:-
“నారాయుడూ...ఆ ఎగస్పార్టీ వాళ్లిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా? కరుసైపోయావు. కారు ఎనకసీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలే.”/ “చూడు గుర్నాధం. నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టిన్చేస్తున్నారని బయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా శగట్రీ. ఎవరైనా సరే పొగిడారో... ఈళ్ళు బాజా కొట్టేస్తారు. నేను బరతం పట్టేస్తాను.”/“అయ్ బాబోయ్.. అదేటండి అలా సూసేత్తన్నారు. ఆవిడ ఎవరనుకున్నారు? పెద్ద ఆఫీసరు భార్య...ఇద్దరు పిల్లలు. దీన్సిగదరగ...ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి! కలాపోసన. పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకీ, మడిసికీ తేడా ఏటుంటాది? అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను.” (కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో)