చిత్రం: 83; నటీనటులు: రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్, జీవా, తఖీబ్ సలీం, జతిన్, చిరాగ్‌పాటిల్, తదితరులు; సంగీతం: జులీస్ పాకియమ్, ప్రీతమ్; సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా; నిర్మాణ సంస్థ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్‌ఖాన్ ఫిల్మ్స్; దర్శకత్వం: కబీర్‌ఖాన్; విడుదల: 24-12-2021.
భారతదేశం తొలిసారి క్రికెట్‌లో ప్రపంచకప్ గెలిచిన సందర్భం.. క్రికెట్ అభిమానులకే కాదు.. ప్రతి ఒక్క భారతీయుడి గుండె ఉప్పొంగిపోయిన సంవత్సరం. అప్పుడు భారత క్రికెట్ జట్టుపై అంచనాలు.. ఆటగాళ్ల మధ్య అనుబంధాలు, వారు చవి చూసిన అవమానాలు.. ఆట, ఆటగాళ్ల చుట్టూ అల్లుకొన్న ఎన్నో భావోద్వేగాలు.. ఇలా ప్రతి ఒక్కటి విలువైనదే. అలాంటి విలువైన, వివేక వంతమైన సన్నివేశాలతో తీర్చిదిద్దినదే '83' చిత్రం. ఓ విజయం.. ఎందరో అనుమానాలు తీరుస్తుంది. ఎందరి ముఖాలపైనో వెలుగులు పూయిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలను నిజం చేస్తుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానమవుతుంది. 1983లో భారత క్రికెట్ జట్టుపై ఉన్న అనుమానాలేంటో? వారి కలలేంటో? వారికి ఎదురైన ప్రశ్నలేంటో? చివరికి వెలిగిపోయిన ముఖాలేంటి? వెలవెలబోయిందెవరు?అనే విషయాలు తెలుసుకోవాలంటే.. '83' చూడాల్సిందే.
కథ:భారత జట్టు ప్రపంచ కప్ పోటీల కోసం ఇంగ్లండ్ బయలుదేరడంతో కథ మొదలవుతుంది. జట్టు మీద ఉన్న తక్కువ అంచనాలను చూపిస్తూ.. సభ్యులను పరిచయం చేస్తూ.. మనల్ని నేరుగా కథలోకి దించేశాడు దర్శకుడు. అక్కడ జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన. అసలైన మ్యాచుల్లో వెస్టిండిస్, జింబాబ్వే జట్లతో గెలుపు.. తర్వాత వరుసగా జట్టు ఓటమి. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఆటలో కపిల్‌దేవ్ విజృంభణ. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై గెలవడం.. జట్టు ఫైనల్‌కు చేరడం. అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత అయిన వెస్టిండిస్ జట్టుతో తుది పోరు.. ఉత్కంఠగా సాగిన ఆ ఆటలో విజయం సాధించి.. భారత జెండాను లార్డ్స్ స్టేడియంలో సగర్వంగా ఎగిరేలా చేసిన క్రికెట్టు జట్టు సమష్టి కృషి. 1975, 1979 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన భారత జట్టు.. 1983లో ఏకంగా ప్రపంచకప్‌ను భరతమాత సిగలో అలంకరించినంత వరకూ ఉత్కంఠగా సాగిన సంఘటనల సమాహారమే '83'లో కథాంశం.
ఎలా ఉందంటే: పాసైపోయామని ముందే తెలిస్తే పరీక్ష ఫలితాలపై ఉత్కంఠ ఏముంటుంది? సాధారణంగా అయితే ఉండదు. కానీ, పరీక్ష రాసిన అభ్యర్థుల వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలు, సంఘర్షణను సరిగ్గా చెబితే అద్భుతంగానే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే చేసి విజయం సాధించాడు దర్శకుడు కబీర్‌ఖాన్. 'లగాన్' చిత్రం తొలిసారి చూసే వాళ్లకు కథ ఏమవుతుందోనన్న ఆతృత ఉంటుంది. కానీ, 1983లో భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్ గెలిచిందని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఉత్కంఠగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సరదా సన్నివేశాలు నవ్విస్తే, భావోద్వేగ సన్నివేశాలు గుండెలు తడిపేస్తాయి. వాటన్నింటినీ సరైన పాళ్లలో రంగరించాడు కబీర్.
ఓ సన్నివేశంలో భారత జట్టు ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. ఎయిర్‌పోర్ట్ అధికారి ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతాడు. దానికేముంది తీసుకోండి అని జట్టు మేనేజర్ మన ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తాడు. అప్పుడు ఆ అధికారి "వీళ్లది ఎవరికి కావాలి. రిచర్డ్స్ ఆటోగ్రాఫ్ తీసుకొని రా" అని అంటాడు. మరో సన్నివేశంలో ఇంగ్లాండ్ వెళ్లాక మన జట్టు మేనేజర్ అక్కడి నిర్వాహకుల దగ్గరకు వెళ్లి తమకి ఇచ్చిన పాస్‌ల్లో లార్డ్స్ మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని ఫిర్యాదు చేస్తాడు. దానికి నిర్వాహకులు నవ్వి.. "మీరా లార్డ్స్ స్టేడియానికా? అంతదాకా వస్తే అప్పుడు చూద్దాం లే" అని అవమానకరంగా మాట్లాడతాడు. అప్పుడు మేనేజర్ కెప్టెన్ కపిల్‌దేవ్ దగ్గరికి వచ్చి "35 ఏళ్లైంది స్వాతంత్య్రం వచ్చి గౌరవం ఇంకా రాలేదు" అని పలికే సంభాషణలు అప్పటి మన జట్టు పరిస్థితిని కళ్లకు కడతాయి. ఇలా ఎన్నో అవమానాల మధ్య బరిలోకి దిగిన జట్టును విజయ పథంలో నడిపించిన కపిల్‌దేవ్ గుండెధైర్యం, ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఎక్కువ సన్నివేశాలు మైదానంలోనే ఉన్నాయి. మ్యాచ్‌లను ఎంత అద్భుతంగా చూపించారో భావోద్వేగాలను అంతే పకడ్బందీగా రక్తికట్టించారు. ఆసిమ్ మిశ్రా సినిమాటోగ్రఫి మనల్ని 1983 కాలంలోకి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశం కనులవిందుగా చూపించారు. నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత అందంగా మార్చింది. క్యాస్టూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ల కష్టం ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కన్పిస్తోంది.
ఎవరెలా చేశారంటే: సినిమాలో ఎక్కడా రణ్‌వీర్‌సింగ్ కనిపించలేదని నాగార్జున చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. ఆహార్యం, ఆటతీరు, ఎక్స్‌ప్రెషన్స్‌లో రణ్‌వీర్.. కపిల్‌దేవ్‌ను అచ్చు గుద్దినట్లు దించేశాడేమో అనిపిస్తుంది. అవమానాలు, బాధలు, విజయాల్లో అతను ప్రదర్శించిన నటన ఆకట్టుకుంటుంది. ఆవేదన, ఆవేశం, నాయకత్వం లాంటి ఉద్వేగాలను సరిగ్గా ప్రదర్శించాడు. కపిల్‌కే ప్రత్యేకమైన నటరాజ్ షాట్ ఆడినప్పుడు అతనే క్రీజ్‌లో ఉన్నాడా?అనిపించిందంటే అతిశయోక్తి కాదు. కపిల్ భార్య రోమి భాటియా పాత్రలో తక్కువ సమయమే కనిపించిన దీపికా పదుకొణె తన పాత్రకు న్యాయం చేసింది. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన జీవా అందులో జీవించేశాడు. జట్టు మేనేజర్‌గా పంకజ్ త్రిపాఠి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. జీవా, అమ్మి విర్క్, జతిన్ సర్ణ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ నటనతో అదరగొట్టేశారు. పాత్రలు, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని దర్శకుడు కబీర్‌ఖాన్ మలిచిన తీరు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. సంభాషణలు మనసుని హత్తుకునేలా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు మాత్రం డ్రామాటిక్‌గా సాగినట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం బాగున్నాయి. జులీస్ పాకియమ్, ప్రీతమ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది. "కప్ గెలిచిన ఆ రోజు మేం భోజనం చేయలేదు. కడుపు ఖాళీగానే ఉన్నా ఆకలి లేదు. మా అందరి గుండెలు విజయంతో నిండిపోయాయి" అని కపిల్‌దేవ్ వాయిస్ ఓవర్‌తో కథ ముగుస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకుల గుండెలు భావోద్వేగం, సంతోషంతో నిండిపోతాయి.
బలాలు
+రణ్‌వీర్‌సింగ్