"ఓ సినిమా విడుదలవుతుందంటే సీనియర్ నటుడికైనా, కొత్తవాళ్లకైనా ఆత్రుతగానే ఉంటుంది" అని సీనియర్ కథానాయిక రాణీ ముఖర్జీ అంటోంది. 'మర్దానీ 2' విజయం తర్వాత ఆమె నటించిన చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ 2'. ఇందులో సైఫ్ అలీఖాన్, సిద్ధాంత్ చతుర్వేది, శర్వరి ఇతర కీలక పాత్రల్లో నటించారు. వరుణ్.వి.శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ పంచుకున్న సంగతులు..
* 'బంటీ ఔర్ బబ్లీ'కి పదిహేనేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ ఇది. అప్పట్లోనే కొనసాగింపు తీయాలని అనుకున్నారు, కుదర్లేదు. నిర్మాత ఆదిత్య చోప్రా మనసులో ఉన్న కథను వరుణ్ అద్భుతంగా తెరకెక్కించారు. అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందీ చిత్రం. యువ జంటగా సిద్ధాంత్ చతుర్వేది, శర్వరీల నటన చాలా క్యూట్‌గా ఉంటుంది. అప్పుడు బబ్లీ పాత్రలో నటించే నాటికి నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. ఇప్పుడు నేను ఓ తల్లిని. నా జీవితంలో వచ్చినట్టే బబ్లీ పాత్ర పరంగానూ చాలా మార్పులుంటాయి.