'ప్రేమించుకుందాం రా' అంటూ రానా దగ్గుబాటి... మిహీకా బజాజ్ కలిసి ఎప్పట్నుంచో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈమధ్యే 'పెళ్లి చేసుకుందాం' అనే నిర్ణయానికొచ్చారు. అందుకు పెద్దల అంగీకారం లభించేసింది. ఇంకేం దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా... అంటూ బాబాయ్ వెంకటేష్ పాడుకున్న పాట ఇప్పుడు అబ్బాయ్ రానా సొంతమైంది. దక్షిణాదితో పాటు హిందీలో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రానా. తన మనసుని దోచిన మిహీకా బజాజ్‌ని త్వరలోనే పెళ్లాడబోతున్నాడు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు బుధవారం హైదరాబాద్‌లో మాట ముచ్చటతో కలిసిపోయాయి.
అబ్బాయ్... ఎంగేజ్‌మెంటా?
తెలుగు సంప్రదాయంలో పెళ్లికి ముందు వేడుకంటే నిశ్చితార్థమే. దగ్గుబాటి వారి ఇంట్లో బుధవారం వేడుక జరిగింది కానీ అది నిశ్చితార్థం కాదు. ఆరా తీస్తే అది రోకా వేడుక అని తెలిసింది. రానా ఇంట్లో వేడుక విషయం తెలుసుకున్న నాని.. 'అబ్బాయ్... ఎంగేజ్‌మెంట్ జరిగిందా?' అంటూ వాట్సప్ చేశారు రానాకి. ఆయన కాదు, రోకా వేడుక అని బదులిచ్చారు. ఆ వేడుక గురించి 'గూగుల్ చేస్తా' అంటూ నాని సరదాగా వ్యాఖ్య చేశారు. ఈ సందేశాన్ని రానా ఇన్‌స్టా స్టేటస్ ద్వారా పంచుకున్నారు.