"నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్ మరింత బలపడింది" అని రానా అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. ప్రభు సాల్మన్ దర్శకుడు. ఈరోస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం తన అనుభవాల్ని పంచుకుంది.
'అరణ్య' నన్ను పూర్తి మనిషిగా మార్చింది: రానా
'అరణ్య' ట్రైలర్ విడుదల వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో రానా. ఈ సినిమా వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు.
"చిన్నప్పటి నుంచి అందరం వింటుంటాం కదా.. 'మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం' అని. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. 'ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఆ భూమిని నువ్వు చూసుకుంటే.. అది నిన్ను మళ్లీ చూసుకుంటుంది' అని. నాకింత మంచి చిత్రం ఇచ్చినందుకు ప్రభుకు థ్యాంక్స్. ఈ సినిమాను మూడు భాషల్లో చేశాం. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, దీన్ని థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో నిర్మాతలు ఏడాది పాటు ఆగారు. వాళ్లకు థ్యాంక్స్" అని రానా అన్నారు.
"ఏనుగులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. కానీ, కొన్నేళ్లుగా ఇక్కడ అనేక కారణాల వల్ల ఏడాదికి 700 నుంచి 800 వరకు ఏనుగులు మరణిస్తున్నాయి. దీనికి అడవులు విస్తీర్ణం తగ్గడమూ ఒక కారణం. దీని ఫలితంగానే పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మనమూ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు. అన్ని రకాల భావోద్వేగాలతో పాటు వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రెండు గంటల పాటు అందమైన అడవి జీవితాన్ని ఆస్వాదిస్తారు" అని అన్నారు దర్శకుడు ప్రభు. ఈ కార్యక్రమంలో నందు ఆహుజా, శ్రియ, జోయా హుస్సేన్ పాల్గొన్నారు.