కెరీర్ ప్రారంభంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానా నటించిన చిత్రం 'నేను నా రాక్షసి'. ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ఇచ్చిన సలహాను తాను ఎప్పటికీ మర్చిపోనని రానా చెప్పారు. గతంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'నెం.1యారి' మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆహా వేదికగా ఈ టాక్ షో 'సీజన్-3' మొదలుపెట్టనున్నారు. షో లాంచ్ ఈవెంట్‌లో భాగంగా రానా తన స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బన్నీ ఇచ్చిన సలహా ఎప్పటికీ మరిచిపోను: రానా - అల్లు అర్జున్ న్యూస్
నెం.1 యారి సీజర్ 3 లాంచ్ ఈవెంట్‌లో క్రేజీ విషయాల్ని పంచుకున్నారు రానా. తన కెరీర్ ప్రారంభంలో బన్నీ ఇచ్చిన సలహాను ఎప్పటికీ మర్చిపోనని వెల్లడించారు.
చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చైతన్య.. తనకు మంచి స్నేహితులని. ముఖ్యంగా చరణ్ తనకు చిన్నప్పటి నుంచి మిత్రుడని.. తన లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానముంటుందని.. చెర్రీ తన 3AM ఫ్రెండ్ అని రానా వివరించారు. ఎలాంటి సాయం కావాలన్నా ముందు చరణ్-బన్నీలకు ఫోన్ వెళ్తుందని ఆయన తెలిపారు.
"కథానాయకుడిగా నేను ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బన్నీ ఇచ్చిన సలహా ఎప్పటికీ మర్చిపోను. 'నేను నా రాక్షసి' షూట్ ప్రారంభమైన సమయంలో బన్నీ లొకేషన్‌కు వచ్చారు. "అరేయ్.. ఇక్కడి వరకూ ఏదో స్కెచ్‌లేసుకుంటూ వచ్చేశావ్. ఇక్కడి నుంచి స్కిల్ లేకపోతే పని జరగదు" అని బన్నీ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది" అని రానా అన్నారు. మిహికాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మొదట తల్లిదండ్రులకే చెప్పానని.. అనంతరం చైతన్యకు కాల్ చేసి చెప్పానని రానా తెలిపారు. తన పెళ్లి వార్త విని చైతన్య ఎంతో సంతోషించాడని.. తాను తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనని అన్నాడని రానా వివరించారు.