తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటనలో మహారాణి.. వెండితెర శివగామి - రమ్యకృష్ణ

అందంతో పాటు అద్భుత నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి.. వెండితెరపై ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది నటి రమ్యకృష్ణ. 'బాహుబలి'లో శివగామిగా కనిపించి ప్రేక్షకుల్ని మైమరిపించింది. నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం.

ramyakrishna birth day special story
రమ్యకృష్ణ

By

Published : Sep 15, 2020, 5:28 AM IST

ఆమె కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే అనుకున్న ప్రేక్షకులకు తన నటనతో సమాధానం చెప్పిన నటి. ఏ భావోద్వేగాన్నైనా పండించగల సామర్ధ్యం ఆమె సొంతం. సోదరిపై ద్వేషం పెంచుకున్న పాత్రైనా, అసూయతో రగిలిపోయే పాత్రైనా, భర్త దూరమైనప్పుడు తన భుజాలపై బాధ్యతల్ని భరించే అమాయకపు భార్య పాత్ర... ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తుంది. ఆమే రమ్యకృష్ణ. అందంతోనే కాదు నటనలోనూ ప్రేక్షకులను మెప్పించగలరు. అందుకే ... సినీ రంగ ప్రవేశం చేసి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వెండితెర రాజ్యాన్ని ఏలుతోందీ 'శివగామి'. నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

కుటుంబ నేపథ్యం

కృష్ణన్, మాయ దంపతులకు 1970, సెప్టెంబర్ 15న జన్మించారు రమ్యకృష్ణ. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె శిక్షణ పొందారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

సినీ కెరీర్...హుషార్

ఎంతోమంది అగ్ర కథానాయకులతో సరిసమానంగా ఆడిపాడిన ఘనత రమ్యకృష్ణ సొంతం. ఏ పాత్రకైనా ప్రాణం పోయగల రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'వెళ్ళై మనసు' అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

తెలుగులో రమ్య

రమ్యకృష్ణ తెలుగులోనూ ఎన్నో శక్తివంతమైన పాత్రలు పోషించారు. 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూత్రధారులు' అనే సినిమాతో రమ్యకృష్ణకు మంచి పేరు వచ్చింది. 1990లలో మీనా, రోజా, నగ్మా, సౌందర్య వంటి అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లుడుగారు', 'అల్లరి మొగుడు', 'మేజర్ చంద్రకాంత్', చిత్రాల్లో మోహన్ బాబుకు జోడీగా నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'అన్నమయ్య' సినిమాలో నాగార్జున, కస్తూరిలతో స్క్రీన్ పంచుకున్నారు. ప్రముఖ తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లతో కలిసి నటించారు.

నీలాంబరిగా విఖ్యాతి

'నరసింహ' చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్రకు ధీటుగా నటించి అభిమానులను ఆకట్టుకోగలిగారు రమ్య. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు 'నీలాంబరి'. అభిమానులు ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనని, పాత్రని అంత సులభంగా మర్చిపోలేరు. పాత్రల్లో జీవించడం రమ్యకృష్ణ శైలి. పొగరుగల పాత్రలు చేస్తే.. రమ్యకృష్ణకు నిజంగా పొగరేమో అని ప్రేక్షకులు అనుకునేంత స్థాయిలో నటిస్తారు. ఏడిపించే పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఏడిపించగల సామర్ధ్యం ఈ నటి సొంతం.

ప్రత్యేక గీతాల్లోనూ సత్తా

నాగార్జున హీరోగా నటించిన సినిమాలో రమ్యకృష్ణ 'నిన్ను రోడ్డుమీద' పాటలో నర్తించి అభిమానులను ఆకట్టుకున్నారు. 'ప్రేమకు వేళయరా' మూవీలో 'చిన్న గౌను వేసుకొన్న' పాటలో రమ్య స్టెప్పులను ఎవరూ మర్చిపోలేరు. జూనియర్ ఎన్టీఆర్​తో 'చిన్నదమ్మే' పాటలో డాన్స్ చేశారు. 'అంజి', 'అడివి రాముడు', తదితర సినిమాల్లోనూ ప్రత్యేక గీతాల్లో మెరిశారు. 'శ్రీ ఆంజనేయం' సినిమాలో 'శ్రీ ఆంజనేయం' అనే పాటలో కనిపించారు.

'బాహుబలి'లో శివగామి

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత వెండితెర శిల్పం 'బాహుబలి'లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న 'శివగామి' పాత్రతో వీక్షకులను పలకరించారు రమ్యకృష్ణ. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా పాత్రలకు ఎంత గుర్తింపు వచ్చిందో రమ్యకృష్ణ పోషించిన 'శివగామి' పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఆ తరువాత 'హలో', 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాల్లోనూ కనిపించారు.

కృష్ణ వంశీతో వివాహం

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. పెళ్ళైన తరువాత వీరిద్దరూ 'శ్రీ ఆంజనేయం' చిత్రానికి కలిసి పని చేశారు.

ప్రతిభకు పురస్కారాలు

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'కంటే కూతుర్నే కను' చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు రమ్యకృష్ణ. 'పడయప్పా'లో తమిళనాడు రాష్ట్ర సినిమా పురస్కారం, ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నారు. తెలుగు చిత్రం 'రాజు మహారాజు' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు.. సిద్దార్ధ్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రంలో నటనకుగానూ ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును కైవసం చేసుకున్నాారు. 'బాహుబలి: ద బిగినింగ్' సినిమా రమ్యకృష్ణ వాకిట్లో వరుసపెట్టి పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు తదితర పురస్కారాలను దక్కించుకున్నారు. 'బాహుబలి: ద కంక్లూజన్' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డును అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details