ఆమె కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే అనుకున్న ప్రేక్షకులకు తన నటనతో సమాధానం చెప్పిన నటి ఆమె. ఏ భావోద్వేగాన్నైనా పండించగల సామర్థ్యం ఆమె సొంతం. సోదరిపై ద్వేషం పెంచుకున్న పాత్రైనా.. అసూయతో రగిలిపోయే పాత్రైనా.. భర్త దూరమైనప్పుడు తన భుజాలపై బాధ్యతల్ని భరించే అమాయకపు భార్య పాత్ర.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తుంది. ఆమే రమ్యకృష్ణ. అందంతోనే కాదు నటనలోనూ ప్రేక్షకులను మెప్పించగలరు. అందుకే.. సినీ రంగ ప్రవేశం చేసి ఏళ్లు గడిచినా ఇప్పటికీ వెండితెర రాజ్యాన్ని ఏలుతోందీ 'శివగామి'. బుధవారం(సెప్టెంబరు 15) రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కుటుంబ నేపథ్యం
కృష్ణన్, మాయ దంపతులకు 1970, సెప్టెంబర్ 15న జన్మించారు రమ్యకృష్ణ. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె శిక్షణ పొందారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
సినీ కెరీర్..హుషార్
ఎంతోమంది అగ్ర కథానాయకులతో సరిసమానంగా ఆడిపాడిన ఘనత రమ్యకృష్ణ సొంతం. ఏ పాత్రకైనా ప్రాణం పోయగల రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'వెళ్ళై మనసు' అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
తెలుగులో రమ్య
రమ్యకృష్ణ తెలుగులోనూ ఎన్నో శక్తివంతమైన పాత్రలు పోషించారు. 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూత్రధారులు' అనే సినిమాతో రమ్యకృష్ణకు మంచి పేరు వచ్చింది. 1990లలో మీనా, రోజా, నగ్మా, సౌందర్య వంటి అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రమ్యకృష్ణ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లుడుగారు', 'అల్లరి మొగుడు', 'మేజర్ చంద్రకాంత్', చిత్రాల్లో మోహన్ బాబుకు జోడీగా నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'అన్నమయ్య' సినిమాలో నాగార్జున, కస్తూరిలతో స్క్రీన్ పంచుకున్నారు. ప్రముఖ తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్‌లతో కలిసి నటించారు.
నీలాంబరిగా విఖ్యాతి
'నరసింహ' చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పాత్రకు ధీటుగా నటించి అభిమానులను ఆకట్టుకోగలిగారు రమ్యకృష్ణ. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు 'నీలాంబరి'. అభిమానులు ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనను, పాత్రను అంత సులభంగా మర్చిపోలేరు. పాత్రల్లో జీవించడం రమ్యకృష్ణ శైలి. పొగరుగల పాత్రలు చేస్తే.. రమ్యకృష్ణకు నిజంగా పొగరేమో అని ప్రేక్షకులు అనుకునేంత స్థాయిలో నటిస్తారు. ఏడిపించే పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఏడిపించగల సామర్ధ్యం ఈ నటి సొంతం.