దేవత పాత్ర చేయాలన్నా, పవర్‌ఫుల్‌గా పరాక్రమం చూపించాలన్నా... నీలాంబరిలా తెగువ చూపాలన్నా, భర్త చాటు భార్యగా అలరించాలన్నా.. ఇలా సినీ పాత్రలకు జీవం పోసి నేటితరానికి శివగామిలా విశ్వరూపం చూపించిన రమ్య కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటించిన మరపురాని కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం!
అమ్మోరు..
ఈ చిత్రంలో రమ్య కృష్ణ కనిపించేది కొద్ది సేపే. కానీ ఆమె ఉన్నంత సేపు ప్రేక్షకులను కట్టిపడేసింది. అమ్మోరుగా కనిపించిన రమ్యకృష్ణను చూస్తే నిజంగా దేవతే వచ్చిందా.. అనేంతగా మైమరిపించింది. క్లైమాక్స్‌లో ఆమె నటన గురించి వేరే చెప్పనక్కర్లేదు మహిశాసురుడిని వధించిన దుర్గాదేవి రూపంలో రౌద్రంగా కనిపించింది.
నరసింహా..
ఈ సినిమా పేరు చెప్పగానే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటన, ఆయన స్టైలే గుర్తుకువస్తుంది. కానీ ఇందులో రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. నీలాంబరి పాత్రలో రజనీకి దీటుగా మెప్పించి ఔరా అనిపించింది. కోరుకున్న వాడిని దక్కించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే మొండితనం ఉన్న యువతి పాత్ర పోషించింది రమ్య. 1999లో విడుదలైన నరసింహా తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌తో పాటు, తమిళనాడు ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది రమ్య.
బాహుబలి..
బాహుబలి చిత్రంలో ఒక్కొక్క పాత్రను అంత సులువుగా మర్చిపోలేం. అందులోనూ శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మహారాణిగా పరాక్రమం చూపిస్తూనే.. అమ్మతనపు మమకారాన్ని పంచింది. విభిన్న ఛాయలున్న శివగామి పాత్రలో మరొకరిని ఊహించలేనంతగా ఆకట్టుకుంది.
అన్నమయ్య..
అన్నమయ్య అనగానే అందరికీ నాగార్జునే గుర్తుకువస్తాడు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయాడు. అయితే ఇందులో రమ్యకృష్ణ పాత్రను అంత సులభంగా తీసేయలేం. అన్నమయ్య మరదలు తిమ్మక్క పాత్రను పోషించింది. ముఖ్యంగా ఈ సినిమాలో 'నిగమా.. నిగమాంత వర్ణిత' అని సాగే పాటలో కళ్లతో ఆమె పలికే భావోద్వేగాలకు ప్రేక్షకులు ముగ్ధులైపోతారు. అంతలా ఆకట్టుకుంది.
ఆహ్వానం..
డబ్బు కోసం భార్యకు విడాకులిచ్చి మరొక యువతిని చేసుకోవాలనుకుంటాడు భర్త. అందుకు నిరాకరించిన భార్య అతడి దారిలోనే వెళ్లి ఏ విధంగా న్యాయం సాధించింది అనేది ఆహ్వానం చిత్ర కథాంశం. ఇందులో భర్త కోసం తపించే ఇల్లాలి పాత్రలో రమ్యకృష్ణ కాకుండా వేరొకరిని ఊహించడం కష్టమే. అంతలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే పాట.. వివాహ బంధం గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
నీలాంబరి..
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మహిళల్లో ఈ కోరిక ఇంకా ఎక్కువ ఉంటుంది. పుట్టుకతోనే అందవిహీనంగా జన్మించిన ఓ గిరిజన యువతి సౌందర్యవతిగా మారేందుకు తాంత్రిక విద్యలను ఆపోసన పట్టి అమ్మాయిలను చంపే ఓ సైకో పాత్రలో నటించింది రమ్యకృష్ణ. హర్రర్ జోనర్లో తెరకెక్కిన ఈ 'నీలాంబరి' సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు.
1970 సెప్టెంబరు 15న జన్మించిన రమ్యకృష్ణ 14 ఏళ్లకే వెల్లయ్ మనసు అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేసింది. అనంతరం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 200 పైచిలుకు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో తెలుగు చిత్ర దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది.
ఇదీ చదవండి: గోపీచంద్ ఇంట స్టార్ హీరోల సందడి