నాకిష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తా.. ఇష్టముంటే చూడండి...లేకపోతే మానేయండి... నేనింతే అంటే ఎవరైన అతని చిత్రాలు చూస్తారా! వేరే దర్శకుల సంగతేమో గానీ రామ్గోపాల్ వర్మ సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. వరసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా వర్మ సినిమాలకి వెళ్తూనే ఉంటారు సినీ ప్రియులు. మరీ ఈ రోజు రామ్గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను చూద్దాం!
కుటుంబ నేపథ్యం...
రామ్గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జన్మించాడు. విజయవాడ సిద్దార్థ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. చిన్నప్పటినుంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న వర్మ దృష్టి క్రమేణా సినిమాలపై పడింది. ఇంజనీరింగ్ తర్వాత కొద్ది రోజులు అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేశాడు వర్మ. అనంతరం శివ సినిమా ద్వారా దర్శకుడయ్యాడు.
సినీ ప్రస్థానం..
తాను కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ చిత్రం వాణిజ్యపరంగా మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు రామ్గోపాల్ వర్మ. శివ అనంతరం గాయం, అంతం, రాత్రి, క్షణ క్షణం, మనీ, ప్రేమకథ, రక్తచరిత్ర, వంగవీటి చిత్రాలతో విజయాలను అందుకున్నాడు.