పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన, అందమైన అనుభూతి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ స్థాయికి, ఆలోచనలకు తగ్గట్లు ఉన్నంతలో గుర్తుండిపోయేలా చేసుకుంటుంటారు. సెలబ్రిటీల విషయానికొస్తే వారి పెళ్లిలు ఎప్పుడూ ఆసక్తికరమే. కొంతమంది నిరాడంబరంగా చేసుకుంటే మరి కొంతమంది వందలాది ప్రముఖుల మధ్యలో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పది తరాలు గుర్తుండిపోయేలా వేడుకను జరుపుకొంటారు.
సెలబ్రిటీలు అన్నాక కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండానే పెళ్లి చేసుకుంటారా ఏంటి అని అంటారేమో? నిజమే.. కానీ కొంతమంది తారలు తమ వివాహానికి చేసిన వ్యయం వింటే నోరెళ్లబెట్టక తప్పదు. మరి మనల్ని ఆశ్చర్యపరిచేలా గ్రాండ్గా వివాహం చేసుకున్న తారలు ఎవరో ఓ లుక్కేద్దామా..!
ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి
2011 మే5న హైదరాబాద్లో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా హాజరయ్యారు. లక్షలాది అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి తంతు నిర్వహించారు. ఈ వివాహానికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. కేవలం మండపానికే రూ.18కోట్లు అయిందట. ఒక్కో పెళ్లి పత్రిక ధర రూ.3 వేలు అని తెలిసింది.
ఈ దంపతులకు 2014లో అభయ్ రామ్, 2018లో భార్గవ్ రామ్లు జన్మించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు.
అల్లుఅర్జున్-స్నేహారెడ్డి
తెలుగు చిత్రసీమలోని క్యూట్ కపుల్స్లో అల్లుఅర్జున్-స్నేహారెడ్డి ఒకరు. 2011 మార్చి 6న వీరి పెళ్లి వైభవంగా జరిగింది. వీరి వివాహ వ్యయం కూడా రూ.100కోట్లని అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు.