ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు, నటుడు గుమ్మడితో కలిసి ఓసారి జపాన్ వెళ్లారు. ట్రైన్లో ఒసాకా పట్టణానికి వెళ్తుండగా మధ్యలో నగోయా అనే స్టేషన్ కనిపిస్తే సరదాగా దిగారు. ప్రకృతి దృశ్యాలు బాగున్నాయని ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. అంతలో ఆ రైలు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుపోయాయి. వెంటనే రైలు కదిలిపోయింది. వాళ్ల సామాన్లు, బట్టలు... అన్నీ రైల్లో ఉండిపోయాయి. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ‘‘బండి ఆపించండి.. మేము ఎక్కాలి’’ అని కేకలు వేశారు. అప్పటికే రైలు... ప్లాట్‌ఫామ్ దాటేసింది.
అందరికీ కంగారు.. భయం! ఎందుకంటే వాళ్లు షూ కూడా రైల్లోనే విప్పేసి కిందకు దిగారు. పైగా లగేజీ పెట్టెలు తెరిచే ఉన్నాయి. ఒక రైల్వే అధికారి దగ్గరకు పరుగెత్తి విషయం వివరించారు. అతడికి ఇంగ్లీషు రాదు. వీళ్లకు జపనీస్ రాదు. మొత్తానికి ఆ పోలీసుకేదో అర్ధమైంది. రైలు టికెట్లు చూపిస్తే, ఫోన్ చేసి రైల్లోని ఓ అధికారికి జరిగిన విషయం వివరించాడు.