టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఉపాసన జంట ఆఫ్రికాలోని టాంజానియాలో విహరిస్తున్నారు. అక్కడ సెరెంగెటి జాతీయ పార్కులో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఆఫ్రికా సఫారీల్లో విహరిస్తున్న మెగా కపుల్ - సెరెంగెటి జాతీయ పార్కు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆఫ్రికాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
జూన్ 14న ఏడో వివాహ వార్షికోత్సవం చేసుకోనున్నారీ దంపతులు. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుంది. దీని వల్లే ఈ జంట ముందుగా టూర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రామ్‌చరణ్ కాలి గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, సముద్రఖని లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.