'మర్డర్' సినిమాతో ఇతరుల్ని చెడుగా చూపించడం తన ఉద్దేశ్యం కాదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య ఆధారంగా 'మర్డర్' సినిమా తీయబోతున్నట్లు ఫాదర్స్ డే సందర్భంగా వర్మ ప్రకటించారు. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై ప్రణయ్ సతీమణి అమృత స్పందించారంటూ ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వర్మ వరుస ట్వీట్లు చేశారు.
"అమృత రాసిందంటూ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై స్పందించాలని ఉంది. ప్రకటనలో తన తండ్రి, తన కథతో నేను 'మర్డర్' సినిమా తీస్తున్నానని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నట్లు రాసుంది. ఇది నిజంగా అమృత రాసినా, లేక అత్యుత్సాహంతో ఇంకెవరైనా రాసినా.. స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. 'మర్డర్'ను నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నా.. కానీ అది నిజమైన కథని నేను చెప్పలేదు. నేను ఈ సినిమా గురించి చెబుతూ సోషల్‌మీడియాలో వాడిన రియల్ ఫొటోలు (అమృత, ప్రణయ్, మారుతీరావు) ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. నాకు ఎవరూ వాటిని వ్యక్తిగతంగా, రహస్యంగా చేతికి ఇవ్వలేదు. కాబట్టి.. నేను ఎవరి నమ్మకాన్ని పోగొట్టలేదు. ఈ కథకు అనేక కోణాలు, కారణాలు ఉండొచ్చు. కానీ నేను ఏ కోణంలో సినిమాను తీయబోతున్నానో విడుదలైన తర్వాతే తెలుస్తుంది. అంతకంటే ముందే సినిమా కథను ఊహించడం పరిణతి చెందిన వ్యక్తుల లక్షణం కాదు"