RGV Tweets on Cinema Ticket Price in AP : సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ... మంత్రి పేర్ని నానికి ట్విటర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత అని వర్మ ప్రశ్నించారు. హీరోల రెమ్యూనరేషన్ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడి పైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఖర్చు, రాబడి విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యం అర్థం చేసుకున్నానన్న ఆర్జీవీ.. సర్కార్ జోక్యంతో సమతుల్యత కంటే దిగువన లేదా ఎక్కువ ధర నిర్ణయిస్తారన్నారు. అదే రీతిలో సినిమాలకు ఎలా వర్తింపజేస్తారని ఆర్జీవీ ప్రశ్నించారు.
సినిమాలకు సబ్సిడీ ఎందుకివ్వరు..
RGV Tweets on Cinema Ticket Price : ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారన్న వర్మ.. ప్రోత్సాహం కోల్పోతే నాణ్యత లోపాన్ని జరుగుతుందని అన్నారు. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పారు. పేదలకు సినిమా చాలా అవసరమని ప్రభుత్వానికి అనిపిస్తే రాయితీ ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ జేబులోంచి వైద్య, విద్యా సేవలకు రాయితీలు ఇస్తున్నారన్న వర్మ.. అదే రీతిలో సినిమాలకు కూడా ఎందుకు సబ్సిడీ ఇవ్వదని నిలదీశారు. పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లే.. రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అని అడిగారు.
మా తలపై కూర్చోవడానికి కాదు మీ అధికారం..
RGV Tweets to AP Minister Perni Nani : ద్వంద్వ ధరల విధానంలో పరిష్కారం ఉంటుందన్న ఆర్జీవీ.. నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను విక్రయించవచ్చు అన్నారు. ప్రభుత్వం కొన్ని టిక్కెట్లు కొని పేదలకు తక్కువ ధరకు అమ్మవచ్చని సూచించారు. అలా చేస్తే 'మేము మా డబ్బును పొందుతాం.. మీరు మీ ఓట్లు పొందవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే అధికారం ఇచ్చారన్న వర్మ.. తమ తలపై కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరారు.