విభిన్న కథలు, నేపథ్యాలను ఎంచుకుంటూ వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అంతేకాదు, అంతకుమించి వివాదాలతో ఆడుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. 'రక్త చరిత్ర'తో ఫ్యాక్షన్‌ను తనదైన కోణంలో చూపించి సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దానికి అనుబంధంగా ఇప్పుడు 'కడప్ప' పేరుతో ఓ వెబ్‌సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియోను షేర్ చేశారు.
"కొన్ని దశాబ్దాల పాటు పగల మూలంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకుంది ఫ్యాక్షన్ వార్. ప్రతీకార జ్వాలల నేపథ్యంలో తీస్తున్న మెగా వెబ్‌సిరీస్ 'కడప్ప' సంబంధించిన ఒక వీడియో ఇది. ఈ మెగావెబ్ సిరీస్‌లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజ జీవితాల ఆధారంగా ఉండబోతున్నాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా నేషనల్ లెవెల్ డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న మొట్ట మొదటి వెబ్ సిరీస్ 'కడప్ప'" అని పేర్కొన్నారు. మరి వర్మ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!