Ram charan keerthy suresh: "కీర్తిసురేశ్ 'అజ్ఞాతవాసి'లోనే నాకు బాగా నచ్చింది. 'మహానటి' చూశాక ఆమె నటనకు అభిమానినయ్యా" అని అన్నారు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'గుడ్‌లక్ సఖి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యభూమిక పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్‌చంద్ర పదిరి నిర్మాత. శ్రావ్య వర్మ సహనిర్మాత. దిల్ రాజు సమర్పకులు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
"నాన్నగారి సందేశాన్ని వినిపించడానికే నేను ఇక్కడికొచ్చా. నాన్న కొవిడ్‌తో ఈ వేడుకకు రాలేకపోయారు. అంతర్జాతీయ తరహా కథల్ని భారతీయ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత నగేష్ కుకునూర్ సొంతం. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్.. తదితర సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి ఈ వేదికను పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. కీర్తి ఇందులో చెప్పిన చిత్తూరు యాస చాలా బాగుంది. ఇలాంటి కథలు కీర్తి మరిన్ని చేయాలి" అని రామ్‌చరణ్ అన్నారు.
"మహానటి' తర్వాత ఒప్పుకొన్న సినిమా ఇది. సీరియస్ సినిమా తర్వాత, ఒక సరదా సినిమా చేయాలనుకున్నా. కథ వినగానే చేయడానికి ఒప్పుకొన్నా. నాకు అంతగా నచ్చింది. నగేష్ కుకునూర్‌తో కలిసి పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమా ప్రయాణంలో చాలా నేర్చుకున్నా" అని కీర్తి సురేశ్ చెప్పింది.