ఇప్పుడు ఎవర్ని కదిలించినా 'ది ఫ్యామిలీ మ్యాన్2'(The Family man 2) మాటే వినిపిస్తోంది. సమంతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్2' ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్‌కు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇందులో సమంత(Samantha) 'రాజీ' అనే తిరుగుబాటుదారుగా కనిపించింది. నిడివి తక్కువే అయినా.. సమంత ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నిజానికి ఒక స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్ ఇలాంటి డీగ్లామర్ పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి. సవాల్‌తో కూడుకున్న పాత్రలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే సమంత ఈ పాత్రను పోషించి అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. ఆమె నటనకు ఎంతోమంది ముగ్దులైపోయారు. ఆమె సహనటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా సమంతకు ఫిదా అయిపోయింది. అంతేకాదు.. రకుల్ ఫ్యామిలీ మొత్తం సామ్‌కు అభిమానులుగా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్(RakulPreeth Singh) ట్వీట్ చేసింది.
"ఫ్యామిలీ మ్యాన్2 చూశాను. చాలా బాగుంది. ప్రతిఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మనోజ్‌బాజ్‌పాయ్‌ను పొగడాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీకు హ్యాట్సాఫ్. 'రాజీ' పాత్రను చాలా చక్కగా చూపించావు. మా కుటుంబంలో నాతో పాటు అందరూ నీ అభిమానులుగా మారిపోయారు. దర్శకద్వయం రాజ్ అండ్ డీకేకు ప్రత్యేక అభినందనలు"