నాతోనే నాకు పోటీ అంటోంది కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. వాణిజ్య ప్రధానంగా సాగే చిత్రాలైనా... నటనకి ప్రాధాన్యమున్న పాత్రలైనా వాటిపై తనదైన ముద్ర వేసే నాయిక రకుల్. దక్షిణాదిలో అగ్ర తారగా గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె, హిందీలోనూ ఐదు సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నితిన్‌తో కలిసి 'చెక్'లో నటించింది రకుల్. అందులో చేసిన న్యాయవాది మానస పాత్ర, తన సినీ ప్రయాణం గురించి ఆమె ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చేసిన రెండు సినిమాల్ని నేను చూశా. ఆయన్నుంచి ఫోన్ రాగానే కచ్చితంగా ఓ కొత్త రకమైన పాత్రలో కనిపిస్తానని ఊహించా. అనుకున్నట్టుగానే ఆయన 'ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. మీ పాత్రకి ఎక్కువ మేకప్ ఉండదు' అన్నారు. 'చెక్' కథ నచ్చడం వల్ల మిగతా విషయాలేవీ ఆలోచించకుండా ఒప్పుకున్నా. నా నమ్మకానికి తగ్గట్టే చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. మానస పాత్ర చాలా బాగుందని చెబుతున్నారు".
"పాత్ర ఎంపిక చేసుకునేటప్పుడు చివరగా చేసిన సినిమాతో, ఇప్పుడు చేస్తున్న సినిమాని పోల్చుకుంటా? నటన పరంగా మెరుగ్గా కనిపిస్తానా? లేదా? అనేది చూస్తా. అలా నాతోనే నేను పోటీ పడుతుంటా. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి చేసిన సినిమాలో నా పాత్ర ఇంకా కొత్తగా ఉంటుంది".