సినిమా అవకాశాలు సన్నగిల్లినప్పుడు హీరోయిన్లు రిస్కు అనిపించినా సరే ఆయా పాత్రల్లో నటించేందుకు ఒప్పుకొంటారు. తమను తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో బలంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే.. గత దశాబ్దకాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన రకుల్‌ప్రీత్.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అయితే హిందీ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన పని కాదు. అక్కడ అందర్నీ ఆకర్షించాలంటే సాహసాలు చేయాలి మరి. ఇప్పుడు రకుల్ అదే సూత్రాన్ని నమ్ముతోంది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటించేందుకు రకుల్ ఇప్పటికే సంతకం చేసింది. డైరెక్టర్ తేజాస్ డోస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ ఓ కండోమ్ టెస్టర్‌గా పనిచేసే యువతి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. దీనిపై ఆమె నేరుగా స్పందించలేదు. సమాజంలో నెలకొన్న కొన్ని సమస్యలను సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉందంటూ తన పాత్ర గురించి చెప్పకనే చెప్పింది.
"ఇక నుంచి అన్నిరకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను సున్నితంగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది."