బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న కొత్తచిత్రం 'డాక్టర్ జీ'. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. దీనిపై రకుల్‌ప్రీత్ సింగ్ స్పందించారు.
"క్యాంపస్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. నేను స్క్రిప్టు విన్నప్పుడే కథ నాకెంతో నచ్చింది. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నా. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని వేచి చూస్తున్నా".
- రకుల్‌ప్రీత్ సింగ్, కథానాయిక
ఈ చిత్రం గురించి దర్శకుడు అనుభూతి కశ్యప్ మాట్లాడుతూ.. "చిత్రానికి ఇద్దరు ప్రతిభావంతులైన తారలు కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. 'డాక్టర్ జీ' సినిమా కోసం చాలా ఆసక్తి రేకిత్తించే పాత్రల్లో రకుల్ - ఆయుష్మాన్ కలిసి నటించడం వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు మరింత అనుభూతిని కలిగించేలా ఉంటుందని నమ్ముతున్నా" అని అన్నారు.
ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ వైద్య విద్యార్థులుగా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. కాలేజీలో ఆయుష్మాన్‌కు సీనియర్‌గా రకుల్ నటించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ వాగ్, సౌరభ్ భారత్ కథను అందించగా.. సుమిత్ సక్సేనా మాటలు రాశారు. ప్రస్తుతం రకుల్ హిందీలో 'సర్దార్ అండ్ గ్రాండ్ సన్', 'మేడే', 'థ్యాంక్ గాడ్' సినిమాలో నటిస్తోంది. ఇందులో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఇక తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న (కొండపొలం) సినిమాలో నటించనున్నారు.
ఇదీ చూడండి:వరుణ్ కొత్త చిత్రం ఆ దర్శకుడితోనే!