కరోనా దెబ్బకు ప్రేక్షకులు కొన్ని నెలల పాటు థియేటర్లకు దూరమయ్యారు. థియేటర్లు తిరిగి తెరచుకోవడం వల్ల ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్ బాట పడుతున్నారు. భారతీయ అన్ని చిత్ర పరిశ్రమల కంటే తెలుగు సినిమా రంగం నుంచే వరస విజయాలు దక్కుతున్నాయి. ఇది సినిమా వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. త్వరలోనే థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఆ నమ్మకంతోనే మరిన్ని భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలు భారీ విజయాలు సాధించి థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతాయని ఎంతో నమ్మకంగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
'హౌస్ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడుతాయి'
త్వరలో సినిమా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కరోనా కూడా తగ్గి ప్రపంచం సాధారణ స్థితికి వస్తుందని భావిస్తోంది.
"థియేటర్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే వాటికి పూర్వవైభవం వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. థియేటర్ల వ్యవస్థ బాగుంటే దానిపై ఆధారపడ్డ ఎంతోమందికి జీవనోపాధి దొరకడమే కాదు భారతీయ సినిమా ఎదుగుదల మరింత ఉన్నంతంగా ఉంటుంది. కరోనా పరిస్థితులు కూడా త్వరలోనే చక్కబడి ప్రపంచం సాధారణ స్థితికి వస్తుందని ఆశగా చూస్తున్నాను" అని చెప్పింది రకుల్.
ఆమె తెలుగులో వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో తీసిన సినిమాలో నటించింది. హిందీలో అజయ్ దేవగణ్ 'మేడే', జాన్ అబ్రహంతో 'ఎటాక్', 'థ్యాంక్ గాడ్' చిత్రాలతో బిజీగా ఉంది.