అన్నా చెల్లి..అక్కా తమ్ముడు... బంధాల నేపథ్యంలో వచ్చిన సినిమాలెన్నో! 'అన్నయ్యా అన్నావంటే ఎదురవనా' అంటూ చెల్లికి భరోసానిచ్చే అన్నవరాలు తెరపై తరచూ కనిపిస్తూనే ఉంటారు. చెల్లెళ్లకి రక్షణగా నిలిచే రాఖీల పోరాటాన్ని చూస్తూనే ఉంటాం. ఆధునిక కథలు, పోకడలు రాజ్యమేలుతున్న ఈ సమయంలోనూ తోబుట్టువుల కథల్ని తెరపై చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నామంటే ఆ బంధం గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెరపై ఎలాంటి బంధాల్లోనైనా ఒదిగిపోయే మన తారల్లో కొందరు, నిజ జీవితంలో రాఖీ పండగని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందామా.
సోదరుడికి రాఖీ కడుతున్న లావణ్య త్రిపాఠి ఈసారి ఎలాంటి ఒత్తిడి లేదు
"అన్ని పండగల కంటే నాకు రక్షా బంధన్ చాలా పెద్ద పండగ. ఎందుకంటే మా కుటుంబం చాలా పెద్దది. అందరం ఒకేచోట చేరి పండగ జరుపుకుంటాం. ఆ రోజు నాకు చాలా పాకెట్ మనీ వస్తుంది. మా అన్నయ్య నన్నెప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఈసారి రక్షాబంధన్‌ను డెహ్రడూన్‌లోనే జరుపుకుంటున్నాను. కొవిడ్ ప్రభావంతో ఆరు నెలలు హైదరాబాద్‌లోనే ఉండిపోయా. ఇంటికి తిరిగొచ్చేందుకు రాఖీ పండగ కూడా కలిసొచ్చింది. చాలా రోజుల తర్వాత ఎలాంటి పని ఒత్తిడి, ఆందోళన లేకుండా చాలా హాయిగా పండగను జరుపుకుంటాను. ఈ దేశంలో అందరూ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలాగా కలిసి కట్టుగా ఉండాలనేది నా కోరిక".
- లావణ్య త్రిపాఠి, కథానాయిక
అక్క సరస్వతితో రాఖీ కట్టించుకుంటున్న కార్తికేయ అక్కతోనే పంచుకుంటా
"తల్లి కొడుకు బంధం తర్వాత అన్నాచెల్లెల బంధమే బలమైనది. మా అక్క సరస్వతి అమెరికాలో ఉంది. రాఖీ పండుగ రాగానే గుర్తొచ్చేది అక్కతో రాఖీ కట్టించుకోవడమే. అమ్మ దగ్గరి నుంచి డబ్బులు తీసుకొని చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాణ్ని. ఈసారి అక్కతో రాఖీ కట్టించుకోవడం కుదరడం లేదు. ఇక్కడే మా కజిన్‌తో రాఖీ కట్టించుకుంటా. గతేడాది రాఖీకి అక్క ఇక్కడే ఉంది. ఆ సమయంలో నా 'గుణ 369' సినిమా విడుదలైంది. అప్పుడు మా ఇంట్లో పెద్ద పండగలా అనిపించింది. సక్సెస్, ఫెయిల్యూర్ ఏది వచ్చినా మా కుటుంబసభ్యుల్లో ఎక్కువగా అక్కతోనే పంచుకునేవాణ్ని. అక్క దగ్గర నాకు చాలా అప్యాయత దొరుకుతుంది. ఈ రాఖీతో కరోనా పతనం మొదలవుతుంది. అది త్వరలో అంతం కావాలి".
- కార్తికేయ, కథానాయకుడు
ప్రతి రాఖీనీ భద్రంగా దాచుకున్నా
"నాకూ, మా చెల్లి మౌనికకి మధ్య ఆరు సంవత్సరాలు తేడా. చిన్నప్పుడు మేమంతగా మాట్లాడుకునేవాళ్లం కాదు. గత ఆరేళ్ల కాలంలో మేమిద్దరం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్ అయిపోయాం. అందుకే ఐదేళ్ల కాలంలో ప్రతి రక్షా బంధన్ నాకు ప్రత్యేకంగానే కనిపిస్తోంది. తను కట్టే ప్రతి రాఖీలో వైవిధ్యం చూపించేందుకు ఇష్టపడుతుంది. ఒకసారి 'సూపర్ బ్రో' అనే విధంగా 'ఎస్' అనే అక్షరంతో రాఖీ చేసి పంపింది. ఇంకోసారి నాకిష్టమైన కుంగ్‌ఫూ పాండా ఫేస్‌తో తయారు చేసిన రాఖీ కట్టింది. ఈమధ్య తను కట్టిన ప్రతి రాఖీని నా దగ్గర భద్రంగా దాచుకున్నా. నిజానికి మేమెప్పుడూ రాఖీని ఇలా సంప్రదాయం ప్రకారం జరుపుకోలేదు. మా చెల్లి కూడా నన్నెప్పుడూ ప్రత్యేకంగా బహుమతి ఏమీ అడగదు. తనకేమన్నా అవసరమైతే కొనిస్తూనే ఉంటా. అయితే ఈ రక్షా బంధన్ మాత్రం మాకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే చెల్లి కొన్నేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండటంతో రాఖీ రోజున తనతో సరిగా గడపలేకపోయా. లాక్‌డౌన్ వల్ల ఈసారి మా కుటుంబం అంతా ఒకదగ్గరే ఉండటం సంతోషంగా ఉంది. కెరీర్ పరంగా మా చెల్లి నాకు ఇచ్చే సలహాల్ని నేను పాటిస్తుంటా. తను చాలా తెలివైనది. ఆమె చదువుకున్నదంతా సినిమా బిజినెస్ గురించే. తనకి నా రంగంపై, నా బలాబలాలపై అవగాహన ఉంటుంది. అందుకే నేను చేసే ఓ పని బాగుందన్నా.. బాలేదన్నా తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. మీ సోదరీమణుల్ని ప్రేమించండి. వారికి అండగా నిలవండి. వాళ్ల ఆలోచనల్ని, మాటల్ని గౌరవించడం నేర్చుకోండి".
- సందీప్‌కిషన్, కథానాయకుడు