ఓ సామాన్య బస్ కండక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అసామాన్యమైన నటనతో, స్టైలిష్ పెర్ఫామెన్స్‌లతో వెండితెరపై అగ్రహీరోగా ఎదిగాడు తలైవా రజనీకాంత్. కోట్లాది మంది సినీప్రియుల గుండెల్లో ఆయనో సూపర్‌స్టార్. కేవలం భారత్‌లోనే కాకుండా జపాన్, మలేసియా, అమెరికా.. ఇలా ప్రపంచం నలుమూలలా కోట్లాది మంది అభిమానులున్నారు. ఈరోజు రజనీ ఈ స్థాయికి చేరుకోవడం వెనక అనేక అవమానాలు, బాధాకర సంఘటనలు ఉన్నాయట. అవే తనలోని నటుడిని మరింత కసిగా పనిచేసేలా ప్రేరేపించాయని చెప్పాడు రజనీ. ఇటీవలే జరిగిన 'దర్బార్' ఆడియో లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.
"16 వయదినిలే' చిత్రం తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నారు. కానీ, సెట్‌కు వెళ్లేవరకూ అడ్వాన్స్ ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పా. అప్పుడాయన 'ఏరా నీకంత పొగరా. నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో' అని అందరి ముందు గట్టిగా అరిచారు. నాకు చాలా బాధేసింది. ఆ కసితోనే నటుడిగా ఓస్థాయికి ఎదగాలనుకున్నా. ఆ తర్వాత రెండున్నరేళ్లలో ఫారిన్ కారు కొన్నాను" అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు రజనీ.