ఏడు పదుల వయసులోనూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సినిమాల్లో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాల్లో నటించి దేశంలోనే అగ్రకథానాయకునిగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారాయన.
అయితే రజనీ సినీ ప్రయాణం చరిత్రగా మారనుందా..? సూపర్ స్టార్ సినిమాలకు వీడ్కోలు(Rajinikanth retirement) పలకబోతున్నారా..? అనే చర్చలు ఈ మధ్య జోరుగా సాగుతున్నాయి. దానికి తోడు ఇటీవల ఆయన పదేపదే అనారోగ్యానికి గురవుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే దీనికి సంబంధించి రజనీకాంత్ స్పందించారు. తన సినిమా భవిష్యత్‌పై ఒక హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తె'(annaatthe shooting) తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన చిత్రబృందంతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారట. తనకు మరికొన్నాళ్లు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులోని మాట బయట పెట్టారట. కరోనా తగ్గి, పరిస్థితులు చక్కపడితే ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారని తెలుస్తోంది.
'అన్నాత్తె' చిత్రంలో కీర్తి సురేశ్, నయనతార, మీనా, కుష్భూ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి:రామోజీ ఫిల్మ్‌సిటీలో రజనీకాంత్ యాక్షన్