రజనీకాంత్, కమల్‌హాసన్.. తమిళ సూపర్‌స్టార్లు ఇద్దరూ దీపావళికి బాక్స్‌ఫీసు వద్ద పోరుకు సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తై' దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో తలైవా గ్రామాధ్యక్షుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత చిత్రీకరణ కోసం రజనీ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి రామోజీఫిల్మ్ సిటీలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వేగంగా షూటింగ్ పూర్తిచేసి.. తదనంతర పనులు చేపట్టాలని ఈ బృందం ప్రణాళికతో ఉంది.
మరోవైపు కమల్‌హాసన్-లోకేశ్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విక్రమ్' చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని సంకల్పించారు. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే కమల్ దీనికోసం రంగంలోకి దిగారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జోరుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమానూ దీపావళి రేసులో నిలపాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.