రాజనాల.. 'కింగ్ ఆఫ్ విలన్స్'గా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలు నటుడిగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచారు. అవకాశాలు అందిపుచ్చుకుని ఆకాశాలు ఈదారు. వెండితెర వైభవాన్ని సంపూర్ణంగా అనుభవించారు. అంతలోనే.. విధి వక్రించి పాతాళాల అంచుల్లోకి జారిపోయారు. నేడు ఆయన(1925, జనవరి 3) జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
విలక్షణ విలనిజం
తెలుగు తెరపై విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన నటులలో రాజనాల పేరు ముందు వరుసలో తప్పకుండా ఉంటుంది. అతి భయానకంగా కళ్ళెర్ర చేయడం.. భీభత్సంగా వికట్టాట్టహాసం చేయడం.. హీరోయిన్‌ను వెంటాడి వేధించడం.. హీరోని క్లైమాక్స్ వరకూ మొండిగా ఎదుర్కోవడం.. రాజనాల మార్క్ విలనిజం. ఆయన తెరపై కనిపిస్తే చాలు మహిళా ప్రేక్షకులు శాపనార్ధాలు పెట్టేవారంటే.. ఆయా పాత్రల్లో ఆయన ఎంతలా జీవించాకో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. విలన్ పాత్రల్లో పెట్రేగిపోయిన ఆయనను 'దుష్ట నట చక్రవర్తి' అంటూ అభినందించేవారు. నెల్లూరులో 1925 జనవరి 3 వైకుంఠ ఏకాదశి పర్వదినాన పుట్టిన రాజనాల అసలు పేరు.. రాజనాల కాళేశ్వరరావు. చిన్నా పెద్దా అంతా ఆయన్ను అభిమానంగా కాళయ్య అని పిలిచేవారు.
1953 నుంచి 1978 వరకు రాజనాల నట జీవితంలో స్వర్ణయుగంగా చెప్పొచ్చు. హీరో ఎన్టీఆర్ అయినా, కాంతారావు అయినా విలన్ మాత్రం రాజనాలే. జానపద చిత్రాల్లో ఆయన విలనిజాన్ని విజృంభించేలా చేశారు. 1952లో రాజమార్గం చిత్రం ద్వారా తెరపరిచితమైన రాజనాల .. 1953లో ప్రతిజ్ఞ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని తారాజువ్వలా నింగివైపు దూసుకువెళ్లారు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. జయసింహ, తెనాలి రామకృష్ణ, సువర్ణ సుందరి, కుటుంబ గౌరవం, వినాయక చవితి, రాజమకుటం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ఉషా పరిణయం జగదేకవీరుని కథ, సిరిసంపదలు, గులేబకావలి కథ, చిట్టి తమ్ముడు, దక్ష యజ్ఞం.. ఇలా అనేకానేక చిత్రాల్లో నటించారు. గుండమ్మ కథ, పరువు ప్రతిష్ట, నర్తన శాల, రాముడు భీముడు, దేవత, బొబ్బిలి యుద్ధం, సిఐడి, శ్రీ సింహాచల క్షేత్ర మహిమ, సత్య హరిచంద్ర, శ్రీ కృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీ కృష్ణావతారం.. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో రాజనాల లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు.
ఎన్టీఆర్, కాంతారావు చిత్రాల్లో రాజనాల తప్పనిసరిగా నటించేవారు. వాళ్ళ కాంబినేషన్ ప్రేక్షక జనాలకు ఎంతో ప్రీతిపాత్రం. హాలీవుడ్‌లో మెరిసిన మొదటి తెలుగు నటుడుగా రాజనాల పేరు చరిత్రకెక్కింది. 1966లో 'మాయాది మాగ్నిఫిషన్' అనే చిత్రంలో ఆయన నడిచి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించారు.
నట జీవితం ఆద్యంతం ఆసక్తిదాయకం
కావలిలో ప్రాథమిక విద్యనభ్యసించిన రాజనాల 5వ తరగతిలో ఉండగా జబ్బున పడ్డారు. జబ్బు నయం అయినా.. స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే చదువుకుని 8వ తరగతిలో మళ్లీ స్కూల్లో చేరారు. స్కూల్ ఫైనల్ అయినా తర్వాత ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో ఆపేసిన రాజనాల సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరై 1944లో రెవెన్యూ శాఖలో గుమస్తాగా చేరారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే.. నాటకాల పట్ల ఉండే ఆసక్తితో రంగస్థలంపై తరచూ నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకాలు వేస్తున్న తరుణంలో ఆయన సహచర నటుడు లక్ష్మీ కుమార్ రెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది. నేషనల్ ఆర్ట్స్ థియేటర్ పేరుతో సంస్థను స్థాపించిన ఈ ఇద్దరు అప్పట్లో ఆత్రేయ రాసిన నాటకాలను రంగస్థలంపై వేయడం రివాజు. రాజనాల, లక్ష్మీ కుమార్ రెడ్డి కలసి అలా ఆత్రేయ నాటకం 'ఎవరు దొంగ' వేస్తూ ఉండేవాళ్లు.