దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.
కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్క్ ఆవశ్యకతను తెలియజేసేలా, 'బాహుబలి 2' క్లైమాక్స్‌లో ప్రభాస్, రానాలు మాస్క్‌లు ధరించి పోరాడుతున్నట్లు రూపొందించిన వీడియోను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు.
ఒక వీఎఫ్‌ఎక్స్ స్టూడియో టీమ్ తయారు చేసిన ఈ వీడియోను షేర్ చేస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపారు జక్కన్న. "ప్రతి ఒక్కరూ భద్రంగా ఈ విధంగా నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నా" అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. "మాహిష్మతిలో ఉన్నా ప్రస్తుతం మాస్క్ తప్పనిసరి అని మర్చిపోవద్దు" అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకుంటోంది.
రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటం వల్ల తిరిగి షెడ్యూల్‌ను ఎలా ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.