RRR Press Meet: 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం) ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్, తారక్, ఆలియాభట్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలన్నీ మీకోసం..
రాజమౌళి: "ప్రెస్‌మీట్ ప్రారంభించడానికి ముందు ఆలియా భట్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఆమెకు వేరే ప్రాంతంలో షూట్ ఉంది. ప్రెస్‌మీట్ కోసమే ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీరు త్వరగా ప్రశ్నలు అడగండి"
తారక్-చరణ్‌లను మొదటిసారి ఒకే ఫ్రేమ్‌లో చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది?
రాజమౌళి: తారక్-చరణ్‌లిద్దరూ ఒకే బైక్‌పై వస్తోన్న షాట్‌ని మొదట షూట్ చేశాను. వాళ్ల మాటలు, ప్రవర్తన చూసిన వెంటనే నేను ఫిక్స్ అయ్యాను. తప్పకుండా ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌లో వర్కౌట్ అవుతుందని.
వివిధ భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందిపడ్డారా?
తారక్: తెలుగు, కన్నడ, హిందీ, తమిళంలోనే నేను డబ్బింగ్ చెప్పాను. మలయాళంలో చెప్పలేదు. చెప్పడానికి ప్రయత్నించాను. కాకపోతే ఆ భాషను ఖూనీ చేస్తున్నట్లు అనిపించింది. దాంతో మా జక్కన్న వద్దని చెప్పడంతో దాన్ని అక్కడి నటులతో చెప్పించాం. నిజం చెప్పాలంటే డబ్బింగ్ విషయంలో ఎక్కడా కష్టం అనిపించలేదు. జక్కన్న ఆవిధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే, కొన్ని భాషలకు ట్రైనర్లను ఏర్పాటు చేశారు.
ఈ సినిమా పది భాషల్లో రిలీజ్ అవుతుందని విన్నాం? అందులో నిజమెంత?
రాజమౌళి: ఐదు భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అవుతోంది. అదే సమయంలో వేరే భాషల్లో డబ్ చేస్తున్నారు. ఆయా భాషలకు సంబంధించిన నటీనటులు డబ్బింగ్ చెబుతున్నారు.
కరోనా సమయంలోనూ షూట్‌కి వెళ్లారు కదా. మీ ఫీలింగ్ ఏమిటి?
ఆలియా: ట్రైలర్ అదిరిపోయింది కదా (నవ్వులు). ముంబయిలో మాకు పిచ్చెక్కిస్తోంది. రాజమౌళి సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరడంతో కరోనా సమయంలోనూ షూటింగ్‌కు వెళ్లాను. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ టీమ్ మొత్తం కష్టపడి పనిచేయడం చూసి నేనెంతో స్ఫూర్తి పొందాను.
రామ్‌చరణ్: కరోనాకు ముందు ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కరోనా సమయంలో ఒకరకంగా డీలా పడ్డాం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మేము మరింత జోష్‌తో లాక్డౌన్ అనంతరం తిరిగి సెట్లోకి వచ్చాం.
తారక్: ప్రతి జీవికి ఓ ఆశ ఉంటుంది. అదే అతడిని నడిపిస్తోంది. అదే మాదిరిగా రాజమౌళి కన్న కలని సాకారం చేయడంలో మేము భాగం కావాలనే జోష్‌తోనే వర్క్ చేశాం.
రాజమౌళి: కరోనా మనకి ఒక్కరికే కాదు.. ప్రపంచం మొత్తానికి వచ్చిన ప్రమాదం. ప్రాణనష్టం వల్ల ఎంతో భయపడ్డాను. ‘ఇప్పటివరకూ పరిగెత్తింది చాలు.. కాస్త నెమ్మదించు’ అని ప్రకృతి మనందరికీ చెప్పినట్లు ఉంది. కరోనా కారణంగా అందరం కలిసి ఇంట్లోనే ఉండటం బాగుంది. కుటుంబంతో ఎంజాయ్ చేశాను. రెట్టించిన ఉత్సాహంతో షూట్ ప్రారంభించాం. కంప్లీట్ చేశాం.
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా వల్ల మీరు మానసిక సంఘర్షణకు గురయ్యారా?
రాజమౌళి: కరోనాతో జరిగిన ప్రాణనష్టం వల్ల బాధపడ్డా. కానీ కరోనా సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేశా. ఏవైనా ఇబ్బందులు వచ్చి మన ఒక్క సినిమానే ఆగిపోతే భయపడతాం. కానీ అన్ని సినిమాలు ఆగిపోయాయి. ప్రపంచం ఆగిపోయింది. ఇది ఒక్క పాజ్ మాత్రమే.. స్టాప్ కాదు.
‘యుద్ధం మొదలైతే ఆయుధాలు దానంతటవే వస్తాయన్నారు’. మరి, ఈసినిమాలో చరణ్-తారక్ వంటి ఆయుధాలను ఉపయోగించారు. ప్రేక్షకుల్ని ఎలా మెప్పించనున్నారు?
రాజమౌళి: ట్రైలర్లో సినిమా మొత్తాన్ని చూపించలేం కదా. సినిమాలో ఇంకా చాలా ఆయుధాలుంటాయి.
టైగర్ని నిజంగానే భయపెట్టారా?
తారక్: ఆ సీన్లో కనిపించని పులి మా జక్కన్న. పరిచయస్థుడైన పులి కాబట్టే నేను కూడా ఒక అరుపు అరిచాను. (నవ్వులు)
కొమురంభీమ్ కోసం మీరు ఏవిధంగా శ్రమించారు?
తారక్: ఆయన పాత్రలోకి లీనం కావడం కోసం ఎంతో శ్రమించాను. స్వతహాగా మనం తెలుగువారం కాబట్టి కొమురంభీమ్ గురించి కొంతవరకూ తెలుస్తుంది. కానీ.. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? మెంటల్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.. ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక పూర్తిస్థాయి విజన్ ఉంది. అన్ని విషయాల్లో ఆయనే నాకు సాయం చేశారు. ప్రతి సినిమాకీ నటుడిగా శ్రమిస్తుంటాను. కానీ ఈ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువగా శ్రమించాను.
‘ఆర్ఆర్ఆర్’లో మీకు నచ్చిన.. నటుడిగా మీరు పూర్తిస్థాయిలో నటించిన సీన్ ఏది?
తారక్: ఒక్క సీన్ అంటే చెప్పలేం. ‘ఆర్ఆర్ఆర్’ అనేది ఒక కమిట్మెంట్. నటులుగా మేము ఆయనకు ఇచ్చిన కమిట్మెంట్. నిజం చెప్పాలంటే.. కరోనాలోనూ మాకు ‘ఆర్ఆర్ఆర్’ గురించే ఆలోచన.
రామ్‌చరణ్: రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఆయన చెప్పినదాన్ని మేము 100 శాతం చేశాం.
వేరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ‘ఆర్ఆర్ఆర్’ సరిపోతుందని భావించే ఈ చిత్రాన్ని ఓకే చేశారా?
తారక్: రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన సినిమాలో నటించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కథ ఓకే చేశా. అప్పుడు నాకు తెలీదు ఇది పాన్ ఇండియా మూవీ అని. షూటింగ్ ప్రారంభించాక.. ఓరోజు ఆయన మా ఇద్దరికీ ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత డబ్బింగ్ మీరే చెప్పాలన్నాడు.
బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబర్చరు అని అంటుంటారు అందులో నిజమెంత?
ఆలియా: ఆ మాటలు నిజమనుకోవడం లేదు. సౌత్ సినిమా.. ముఖ్యంగా జక్కన్న సినిమాలో చేయాలనేది నా లైఫ్‌టైమ్ డ్రీమ్. చాలామంది తారలు సైతం అలాగే అనుకుంటున్నారు. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్ తారలు కూడా ఇక్కడ నటిస్తారు.
చరణ్-తారక్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది?
ఆలియా: వాళ్లిద్దరూ మంచి నటులు. వాళ్లతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది. ఎన్నో నేర్చుకున్నాను. నాకు మంచి భోజనం రుచి చూపించారు. మరోసారి ఛాన్స్ వస్తే తప్పకుండా రాజమౌళి సర్‌తో వర్క్ చేయాలని ఉంది. (అనంతరం రణ్‌బీర్‌ని ఉద్దేశిస్తూ మీ జీవితంలో ‘ఆర్’ అనే లెటర్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది కదా. దానిపై స్పందించాలని విలేకరి కోరగా.. ‘ఐ లవ్ ఆర్ఆర్ఆర్’ అని ఆలియా సమాధానం ఇచ్చింది)
రాజమౌళి: చరణ్-తారక్ సెట్లో ఎలా ఉంటారో చెప్పు?
ఆలియా: నా ఫస్ట్ డే షూట్ తారక్‌తో జరిగింది. తారక్ నన్ను చూసిన వెంటనే.. ‘‘కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చరణ్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్ లేదు’’ అని చెప్పారు. ఆ తర్వాత రోజు చరణ్‌తో షూట్.. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ, వాళ్లిద్దరూ ఒక చోట కలిస్తే పక్కన ఎవరు ఉన్నారనేది పట్టించుకోరు. తారక్.. చరణ్‌ని సరదాగా ఆటపట్టిస్తుంటారు.
మీకు తెలుగు ఎవరు నేర్పించారు?
ఆలియా: ‘ఆర్ఆర్ఆర్’ ఓకే చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు అక్షయ్ అనే వ్యక్తి దగ్గర తెలుగులో ట్రైనింగ్ తీసుకున్నా. ఒక ఏడాదంతా జూమ్ కాల్‌లోనే తెలుగు నేర్చుకున్నా.
ఆలియాని మొదటిసారి సెట్లో చూశాక మీ ఫీలింగ్ ఏమిటి?
రామ్‌చరణ్: తారక్ చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్‌డే షూట్ అతనితోనే
తారక్: నీకు జంట కదా. కాబట్టి నువ్వు చెబితేనే బాగుంటుంది (నవ్వులు)