బాలీవుడ్లో తన ఫేవరెట్ యాక్టర్ రణ్బీర్ కపూర్ అని చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. రణ్బీర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర' చిత్ర దక్షిణాది మోషన్ పోస్టర్ను జక్కన్న విడుదల చేశారు. ఈ సినిమాలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఆలియా భట్, మౌనిరాయ్ వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా శనివారం ప్రెస్మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా రణ్బీర్ నటనపై ప్రశంసలు కురిపించారు రాజమౌళి.
"బాలీవుడ్లో నా ఫేవరెట్ హీరో రణ్బీర్. అతను పెద్దగా యాక్టింగ్ చేస్తున్నట్లు కనపడడు. కళ్లలోనే ఇంటెన్సిటీ కనబడుతుంది. చూసేందుకు నార్మల్గా కనబడినా అతడిలోపల ఎంతో శక్తి దాగుంది. అచ్చం శివుడిలా. ఈ సినిమాలో అతడిని ఎంపిక చేయడమే పెద్ద ప్లస్. ఇక దర్శకుడు అయాన్ తొలుత నా దగ్గరికి వచ్చినప్పుడు.. ఇతను నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడే అనిపించింది. నాకన్నా అతడికి సినిమా పిచ్చి ఎక్కువ. 'బ్రహ్మాస్త్ర' గురించి చెబుతుంటే.. ఒక బ్రహ్మాండం సృష్టించబోతున్నాడనిపించింది."
-రాజమౌళి, దర్శకుడు
రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్న రణ్బీర్..
ప్రపంచంలోనే తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని చెప్పారు రణ్బీర్. దేశంలో ఆయనే నెం.1 అని కొనియాడారు. స్టేజి మీదకు వచ్చేటప్పుడు రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్నారీ బాలీవుడ్ హీరో. అనంతరం నాగార్జున బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు.