"మొదట్లో నాకు తగ్గట్లుగా ఉండే ఇలాంటి పాత్రలే చేయాలని కొన్ని పరిమితులుండేవి. ఇప్పుడా కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకొచ్చా. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రయోగాలు చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అంటోంది నటి మేఘా ఆకాష్. ఇప్పుడామె శ్రీవిష్ణుతో కలిసి నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. హితేశ్ గోలి తెరకెక్కించారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది మేఘ.
"లాక్‌డౌన్‌లో ఈ కథ విన్నా. హితేశ్ స్క్రిప్ట్ వినిపించినప్పుడే చాలా నచ్చేసింది. నేనిప్పటి వరకు ఇలాంటి భిన్నమైన కథ వినలేదు. ఇంతటి విభిన్నమైన పాత్రని పోషించలేదు. నేనిందులో సంజన అనే యువతిగా కనిపిస్తా. ఇష్టమైన దాని కోసం ఎంతైనా కష్టపడే బలమైన అమ్మాయి తను. ఇది ఓ హీరో చుట్టూనో.. లేదంటే హీరోయిన్ చుట్టూనే తిరిగే కథ కాదు. కథలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యముంటుంది."