సినిమాల కోసం క్లాసులు ఎగ్గొట్టలేదు... లక్ష్యం మోజులో కెరీర్ నిర్లక్ష్యం చేయలేదు.. చదువుతూనే వెండితెర కలలు కన్నాడు. అమ్మానాన్నలు భాషపై మమకారం పెంచితే.. కజిన్ దానికి దారి చూపాడు. కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా అవే చర్చలు! చివరికి లక్షన్నర జీతమొచ్చే కొలువు వదిలి చిత్రాల బాట పట్టాడు. తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్నాడు. తనే 'రాజరాజచోర' దర్శకుడు హసిత్ గోలి. తన నేపథ్యం.. కళాశాల సరదాలు.. ఇక్కడిదాకా చేసిన ప్రయాణం అతడి మాటల్లోనే...
ఇల్లే పాఠశాల: చిన్నప్పట్నుంచీ సాహిత్యంపై నాకు కొంచెం ఆసక్తి ఉండేది. దానిక్కారణం నాన్నే. హౌజింగ్ కార్పోరేషన్‌లో సివిల్ ఇంజినీర్ ఆయన. భాషపై బాగా పట్టుండేది. ఇప్పటికీ ఒక బ్లాగ్ నిర్వహిస్తూ పద్యాలు రాస్తున్నారు. చిన్నప్పుడు నేను పద్యాలు, శతకాలు చదివితే చిన్నచిన్న బహుమతులిచ్చేవారు. ఆదివారం వస్తే చాలు.. పదవినోదం పజిల్ కోసం ఇంట్లోవాళ్లం కొట్టుకునేవాళ్లం. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల తెలుగు భాషపై ఇష్టం, మమకారం ఏర్పడింది. రాన్రాను అది సినిమాలవైపు మళ్లింది.
అలా మొదలైంది: దర్శకుడు వివేక్ ఆత్రేయ నాకు కజిన్. ఒకరకంగా చెప్పాలంటే తనే నాకు ప్రేరణ. ఇద్దరం కలిసి రిలీజైన ప్రతి సినిమాకు వెళ్లేవాళ్లం. తర్వాత ఫలానా సీన్ ఇలా ఉంటే బాగుండేది అంటూ చర్చించుకునేవాళ్లం. నేను నాకు తోచినవి చెబుతుండేవాణ్ని. విజయవాడలో ఇంటర్, బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి గుర్‌గ్రామ్, దిల్లీ, హైదరాబాద్‌లలో ఉద్యోగాలు చేసినప్పుడు కూడా ఫోన్లో మామధ్య సినిమా చర్చలు నిరంతరం కొనసాగుతుండేవి.
పిలానీ క్యాంపస్‌లో: బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చదివా. ఆ క్యాంపస్ నాపై తీవ్ర ప్రభావం చూపించింది. అదొక మినీ భారతం. రకరకాల మనస్తత్వాలు కనిపించేవి. తెలుగువాళ్లూ ఎక్కువే. వాళ్లలో సినిమాలపై ఆసక్తి ఉన్నవాళ్లతో జట్టు కట్టా. అక్కడి తెలుగు కల్చరల్ క్లబ్, ఆంధ్రసమితిల్లో యాక్టివ్‌గా ఉండేవాణ్ని. క్లబ్ ఆర్గనైజర్‌గా ఓ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ గారిని పిలిపించాం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. అక్కడ క్యాంపస్‌ను ఎనభై శాతం విద్యార్థులే నిర్వహించేవాళ్లు. ప్రతి ఒక్కరికీ బాధ్యతలుండేవి. దాంతో తప్పనిసరిగా స్వీయ క్రమశిక్షణ అలవడుతుండేది. నా ఆలోచనలు చెప్పి మిగతా వారిని ఒప్పించడం.. ముందుండి కార్యక్రమాలు నడిపించడం.. ఇవన్నీ తర్వాత నేను సినిమా కథలు చెప్పడానికి బాగా ఉపయోగపడ్డాయి.
వయా షార్ట్‌ఫిల్మ్: అప్పుడు వివేక్ చెన్నైలో, నేను దిల్లీలో ఉద్యోగాలు చేస్తుండేవాళ్లం. సినిమా పిచ్చి పీక్స్‌కు¨ వెళ్లిన దశలో కనీసం షార్ట్‌ఫిల్మ్స్ అయినా చేయాలనుకున్నాం. కెమెరామన్ వేదరామన్ మాతో చేతులు కలిపాడు. మాకున్న పరిమిత వనరులతోనే వరుసగా మూడు లఘుచిత్రాలు తీసి యూట్యూబ్‌లో పెట్టాం. దీనికోసం నేను చెన్నై వెళ్లి వస్తుండేవాణ్ని. షార్ట్‌ఫిల్మ్స్ మాకు మంచి పేరు తీసుకొచ్చాయి. వాటి ద్వారానే వివేక్‌కి 'మెంటల్ మదిలో' దర్శకుడిగా అవకాశం వచ్చింది. నేను ఉద్యోగం వదిలేసి తన దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయా. ఇంట్లోవాళ్లు గాబరా పడ్డారు. ఇంత చదివి, మంచి ఉద్యోగం వదిలేయడం ఏంటని అమ్మ బాధ పడింది. 'నాన్న, ఉద్యోగం చేస్తూ సినిమా చేయొచ్చు కదా?' అన్నారు. సాధ్యం కాదనేసరికి సరేనన్నారు. తర్వాత మా సినిమాకు మంచి పేరు రావడం వల్ల వాళ్లకు మాపై నమ్మకం ఏర్పడింది.
అవకాశం అందింది: మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా.. సినిమాలతో హీరో శ్రీవిష్ణుతో మంచి పరిచయం ఏర్పడింది. బ్రోచేవారెవరురా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే రాజరాజచోర కథ రాసుకొని తనకు చెప్పా. బాగా నచ్చిందన్నారు. దాన్ని ఎం.ఎల్.కుమార్ చౌదరి గారికి చెప్పడం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ జాయిన్ కావడంతో పెద్దగా కష్టపడకుండానే, సినిమా కష్టాలేం లేకుండానే దర్శకుడిగా అవకాశం దక్కింది. అయితే షూటింగ్ మొదలు కాగానే లాక్‌డౌన్ వచ్చిపడింది. ఒకటి.. రెండు అనుకుంటూ ఏడెనిమిది నెలలు పని ఆగిపోయింది. నాలో కొంచెం గాబరా మొదలైంది. అయినా హీరో, ప్రొడక్షన్ టీం 'ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు.. సినిమా పూర్తి చేద్దాం' అనే భరోసా ఇవ్వడం వల్ల నమ్మకంగా ముందుకెళ్లా. ఈ గడ్డుకాలంలో అదృష్టవశాత్తు అందరూ సేఫ్‌గా ఉండటంతో కొంచెం ఆలస్యమైనా నా కల నెరవేరింది. ఈ ప్రయాణంలో ఎన్నో మర్చిపోలేని అనుభవాలు మూటగట్టుకున్నా.
ప్రతి పనిలో ఎత్తుపల్లాలుంటాయి. వాటికి సిద్ధమై చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తే ఏ పనీ కష్టం అనిపించదు. ఎంత పెద్ద లక్ష్యమైనా తేలికగా చేరుకోగలుగుతాం. నా దృష్టిలో సక్సెస్ అనేది ఒక గమ్యం కాదు గమనమే.