అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో రాజ్‌కుంద్రాపై రోజురోజుకూ ఉచ్చు బిగుస్తోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేస్తున్న విచారణలో భాగంగా.. ఇతడికి చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లలో సింగపూర్ నుంచి కాన్పూర్‌కు నగదు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి బర్రాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాగా మరొకటి కాన్పుర్ కంటోన్మెంట్‌లోని ఎస్బీఐ.
సింగపూర్ నుంచి రాజ్‌కుంద్రా ఖాతాలకు భారీగా నగదు బదిలీ!
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో రాజ్‌కుంద్రాపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో.. కుంద్రాకు చెందిన వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లకు సింగపూర్ నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
ఇందులో మొదటి అకౌంట్ హర్షిత శ్రీవాత్సవ అనే మహిళ పేరు మీద ఉండగా, రెండొవది నర్బద శ్రీవాత్సవ అనే పేరు మీద ఉంది. ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఆదేశాల ప్రకారం ఈ రెండు అకౌంట్లను సీజ్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులకు రాజ్‌కుంద్రా వాట్సాప్ గ్రూప్‌లోని ఓ వ్యక్తికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుంద్రాకు సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నాడని వారు తెలిపారు.
ఈ నగదు బదిలీలకు సంబంధించి కాన్పుర్‌లోని నర్బద శ్రీవాత్సవ ఇంట్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోదాలు నిర్వహించి, వారిని విచారించారు. అనంతరం మీడియా వారితో మాట్లాడగా.. అధికారులు అసలు సోదాలు ఎందుకు నిర్వహించారో తమకు అర్థం కాలేదని వెల్లడించారు. ఏం జరుగుతోందో కూడా తమకు తెలియదని వారు చెప్పడం గమనార్హం.