రాజ్‌కుంద్రా(Raj kundra porn case).. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొకొచ్చేది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఈ లండన్ వ్యాపారవేత్త 2009లో శిల్పను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో కుంద్రా చీకటి నేపథ్యం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణంలో కుంద్రాపై బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గంటల తరబడి దిల్లీ పోలీసులు కుంద్రాను విచారించారు. ఈ సందర్భంగా తాను బెట్టింగ్‌లకు పాల్పడినట్లు కుంద్రా అంగీకరించారు. ఏడుగురు బుకీలతో సంప్రదింపులు జరిపానని, మ్యాచ్‌లు మాత్రం ఫిక్స్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో 2015లో బీసీసీఐ.. కుంద్రాను శాశ్వతంగా ఐపీఎల్ నుంచి వెలివేసింది.
అయినా క్రీడల్లో కుంద్రా భారీగా పెట్టుబడులు పెడుతూనే వచ్చారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ భాగస్వామ్యంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లీగ్‌ను, తర్వాత ఐపీఎల్ పేరుతో ఇండియన్ పోకర్ లీగ్‌ను ప్రారంభించారు. బెస్ట్ డీల్ టీవీ పేరుతో ఓ టెలీ షాపింగ్ ఛానల్ కూడా ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు వాటాలు ఉన్నాయి. 2018లో బిట్‌కాయిన్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కుంద్రాను ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కుంభకోణంలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చితో సంబంధాలపై కూడా కుంద్రాను విచారించారు. దాదాపు తొమ్మిది గంటలు ప్రశ్నించారు. ఇలా వివాదాలు వస్తున్నా.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చిన కుంద్రా రెండేళ్ల క్రితం అశ్లీల చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. హాట్‌షాట్స్ యాప్‌లో తన సినిమాలను ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే.. హాట్‌షాట్స్ కాకుండా చాలా అశ్లీల యాప్‌లను కుంద్రా నిర్వహిస్తున్నారని పోలీసుల ఆరోపణ.
ఆ షూటింగే పట్టిచ్చింది
నిజానికి రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు సోమవారం అరెస్టు చేసినా, ఐదు నెలల నుంచి అతనిపై నిఘా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్‌లోని ఓ బంగ్లాపై దాడి సమయంలో కుంద్రా పేరు పోలీసుల దృష్టికి వచ్చింది. దాడి సమయంలో బంగ్లాలో ఓ అశ్లీల చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్టు చేశారు. విచారణ సందర్భంగా అశ్లీల చిత్రాల రాకెట్‌తో రాజ్‌కుంద్రాకు సంబంధం ఉందని పోలీసులకు తెలిసింది. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల అప్పుడు అరెస్టు చేయలేదు.
అది అశ్లీలం కాదు: గహనా
రాజ్‌కుంద్రా సంస్థలో మూడు సినిమాల్లో నటించిన నటి గహనా వశిష్ఠ్ రాజ్‌కుంద్రాకు మద్దతుగా నిలిచారు. తాము అశ్లీల చిత్రాలు తీయలేదని, తాము తీసిన చిత్రాలు ఆ విభాగంలోకి రావని, పోలీసులే అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్‌లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో గహనా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.