గుండెపోటుతో మరణించిన బాలీవుడ్ దర్శకనిర్మాత రాజ్ కౌశల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన భార్య, నటి మందిరా బేడీ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ముంబయిలోని శివాజీ పార్క్ శ్మశానవాటికకు రాజ్ కౌశల్ భౌతికకాయాన్ని మందిరా బేడీ మోసుకుంటూ వచ్చారు. అక్కడికి చేరుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను ఓదార్చారు. హిందీ చిత్రసీమకు చెందిన రోనిత్ కుమార్, సమీర్ సోని, ఆశిష్ చౌదరి, డినో మోరియో.. రాజ్ కౌశల్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
దర్శకనిర్మాత రాజ్ కౌశల్ (49) గుండెపోటుతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 'ప్యార్ మే కభీ కభీ', 'షాదీ కా లడ్డూ', 'ఆంటోనీ కౌన్ హై' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దర్శక నిర్మాతగానే కాకుండా స్టంట్ డైరెక్టర్‌గానూ మంచి గుర్తింపు పొందారాయన.