హిందీలో సత్తా చాటుతున్న తెలుగు దర్శకద్వయం రాజ్ - డీకే. ఇప్పుడక్కడ ఈపేరు ఒక బ్రాండ్. బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. 'ది ఫ్యామిలీమేన్' వెబ్‌సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ దర్శకద్వయం నిర్మించిన 'సినిమా బండి' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా రాజ్, డీకేతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది.
'సినిమా బండి'తో మరో యాసను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈకథలో మొదట మిమ్మల్ని ఆకట్టుకున్నది అదేనా?
రాజ్: దర్శకుడు ప్రవీణ్ మొదట ఒక కాన్సెప్ట్‌తో వచ్చాడు. పాత్రలు స్థానిక యాసలో మాట్లాడతాయని చెప్పాడు. ‘సినిమా బండి’ని ఎలా తీయాలనుకుంటావో, అదే తరహాలో ఒక లఘు చిత్రం తీసుకు రమ్మని చెప్పా. అది నచ్చితే సినిమా చేయాలనుకున్నాం. లఘు చిత్రం చూస్తున్నప్పుడు అందులో భాష ఇంకా బాగా నచ్చింది. నిజానికి ప్రవీణ్ మాట్లాడే యాస అది కాదు, రచయితలదీ గోదావరి ప్రాంతం. పాత్రలు మాట్లాడే యాస విన్న వెంటనే మదనపపల్లి దగ్గర, రామసముద్రం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా అమ్మమ్మవాళ్లు ఇలాగే మాట్లాడేవారు. అలా ఆ మాటలు నన్ను ఆకట్టుకున్నాయి.
డి.కె: సినిమా బండి చూసిన వాళ్లంతా అందులోని యాస గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో మాట్లాడే యాస ఇది. చాలా మందికి ఈ యాస పరిచయం లేదు. మాది చిత్తూరే కాబట్టి, మేం స్కూల్ రోజుల్లో ఇలాగే మాట్లాడేవాళ్లం. సినిమాల్లో మాట్లాడే తెలుగు, మేం మాట్లాడే తెలుగు వేరేలా ఉందేంటి అనుకునేవాళ్లం అప్పట్లో. కానీ ఈ కథ, అందులోని పాత్రలు మాట్లాడే యాస వినగానే 'ఇది కొత్తగా ఉంటుంది, చేద్దాం' అనుకున్నాం. భాష, యాస ఇవేవీ అర్థం కాకపోయినా హిందీ ప్రేక్షకులూ భలే మెచ్చుకుంటున్నారు.
తెలుగులో ఓటీటీ ట్రెండ్‌ను గమనిస్తే ఏం అనిపిస్తోంది?
రాజ్: ఇది ఓటీటీ వేదిక, అది థియటర్ అని కాకుండా... ఆ రెండూ కలిసిపోయిన కొత్త రోజులివి. ఓటీటీలో విడుదలైనా, థియేటర్లో విడుదలైనా సినిమా సినిమానే. దానికి ప్రేక్షకుల నుంచి ఒకే రకమైన స్పందన బయటికొస్తోంది. హిందీలో రెండేళ్ల ముందు నుంచే ఆ వాతావరణం ఉంది. తెలుగులో ఇప్పుడు అదే కనిపిస్తోంది.
డి.కె: ఎక్కడ విడుదల చేయాలనుకున్నా... మాకు అదొక సినిమానే. కథపై నమ్మకంతోనే ‘సినిమా బండి’ నిర్మాణాన్ని ప్రారంభించాం. పరిస్థితులను బట్టి ఓటీటీలో విడుదల చేశాం.
మహేశ్, విజయ్‌తో దర్శకద్వయం రాజ్-డీకే సినిమా! - సినిమా బండి మూవీ దర్శకద్వయం రాజ్ డీకే
దర్శకద్వయం రాజ్-డీకే నిర్మించిన 'సినిమా బండి' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలు సహా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ ద్వయం తెలిపారు. తెలుగులో సినిమా చేసేందుకు మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.
రాజ్-డీకే
ఇదీ చూడండి: 'కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమేద్దాం'