సినీ నేపథ్యం లేకున్నా.. వచ్చే అవకాశాల్లోనే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. ఆమె నటించిన 'రాత్ అకేలీ హై' చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడానికి తను ముంబయికి వెళ్లాలి అనుకున్నప్పుడు చాలా మంది బాలీవుడ్ గురించి చెడుగానే చెప్పారని తెలిపింది.
'బాలీవుడ్లోకి వెళ్తే అత్యాచారం చేస్తారని చెప్పారు'
చిత్రపరిశ్రమలో అడుగుపెట్టకముందు బాలీవుడ్ గురించి చాలా మంది తనకు చెడుగా చెప్పారని అంటోంది నటి రాధికా ఆప్టే. సినిమాలో అవకాశాల కోసం వెళ్తే తనపై అత్యాచారం చేస్తారని కొంతమంది చెప్పినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
"నేను ఉండే పుణె నుంచి సినిమాల కోసం ముంబయి వెళ్లాలని భావించా. అప్పుడు చాలా మంది నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్తే నీపై అత్యాచారం చేస్తారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారు. సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదు. అసలు సమస్య ఎక్కడుందంటే.. మనం కేవలం బాలీవుడ్‌లో జరిగే అతి గురించే మాట్లాడుకుంటాం. కానీ మనమంతా మనుషులమేనని అర్థం చేసుకోవాలి. నేను అందరిలాంటి మనిషినే. అందరివి సాధారణ జీవితాలుగానే చూడాలి" అని రాధిక చెబుతోంది.