Radheshyam review:చిత్రం:రాధేశ్యామ్;నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ); సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్; డైరక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్;ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్; సౌండ్ ఇంజనీర్:రసూల్ పూకుట్టి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్; నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ; బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్; విడుదల:11-03-2022
నాలుగేళ్లుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ... విడుదల గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్(Radhe Shyam). భారతీయ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ప్రేమకథ ఇదే అనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో తన సత్తాని చాటిన ప్రభాస్(Prabhas)కి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. ఆ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకునే రూ. 300 కోట్ల వ్యయంతో ‘రాధేశ్యామ్’(Radhe Shyam) రూపొందింది. ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రచార చిత్రాలు మరిన్ని అంచనాల్ని పెంచాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? యాక్షన్ చిత్రాలతో సందడి చేసిన ఆయన ప్రేమికుడిగా ఎలా ఒదిగిపోయాడు?విధికీ, ప్రేమకు జరిగిన సంఘర్షణలో ఎవరు గెలిచారు?
కథేంటంటే: విక్రమాదిత్య (ప్రభాస్)(Prabhas) పేరు మోసిన జ్యోతిష్యుడు. ఇటలీలో నివసిస్తుంటాడు. హస్త సాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకున్న ఆయన తన జీవితం గురించి కూడా ఓ స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేరణ (పూజాహెగ్డే)(Pooja Hegde)ని కలుస్తాడు విక్రమాదిత్య. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ, ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఎలాంటిదనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: మన రాత మన చేతుల్లో లేదు, చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమకథతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ‘బాహుబలి’ సినిమాల తర్వాత, అందుకు పూర్తి భిన్నమైన కథల్ని ఎంచుకుని ప్రయాణం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ప్రభాస్ ఒప్పుకున్న మరో సినిమానే ఇది. ఇదివరకటి సినిమాల్లోలాగా ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గ మాస్ అంశాలు ఇందులో ఉండవు. ప్రేమకథే కాబట్టి అందుకు తగ్గ సంఘర్షణతోనే ఈ సినిమా సాగుతుంది. ప్రేమకథలకి నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలు కీలకం. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), పూజా(pooje hegde)ల జోడీ అందంగా కనిపించింది. కెమిస్ట్రీ కూడా బాగా పండింది కానీ... అందుకు దీటైన మరిన్ని సన్నివేశాలు లేకపోవడం సినిమాకి మైనస్. కథలో కొత్తదనం ఉంది. జ్యోతిష్యం ఒక శాస్త్రం అని చెబుతూనే... మన రాతని మనమే రాసుకోవచ్చని చెప్పిన తీరులో చాలా స్పష్టత ఉంది.
ప్రథమార్ధం అందమైన యూరప్ నేపథ్యం, నాయకానాయికల పరిచయం, ప్రేమ నేపథ్యంలో ఆహ్లాదంగా సాగుతుంది. వీరోచితమైన ఎంట్రీ తరహా మాస్ అంశాలకి ఈ కథలో చోటు లేకపోయినా దర్శకుడు అక్కడక్కడా అభిమానుల్ని మెప్పించేలా కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా కథానాయికతో కలిసి ట్రైన్‌లో చేసే విన్యాసం, ఆ సన్నివేశాల్ని తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. జగపతిబాబు చేయి చూసి జాతకం చెప్పడం, ఆస్పత్రిలో శవాల హస్త ముద్రల్ని చూసి వాళ్ల గురించి చెప్పడంలాంటి సన్నివేశాలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు కూడా వీరోచితంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో నాయకానాయికలు ఒకరినొకరు కలుసుకోవడం, వాళ్లు దగ్గరవడం ఒకెత్తైతే.. విక్రమాదిత్యని ప్రేరణ ప్రేమించడం మొదలయ్యాక కథ మలుపు తీసుకోవడం మరో ఎత్తు. మొత్తంగా క్లాస్‌గా సాగే ఓ ప్రేమకథ ఇది. తన ఇమేజ్ నుంచి బయటికొచ్చి విక్రమాదిత్య పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు ప్రభాస్.
ఎవరెలా చేశారంటే: ప్రేమకథల్లో నాయకానాయికల జోడీనే కీలకం. ఇందులో కూడా అంతే. ప్రభాస్(Prabhs) పూజా(Pooja) జోడీ అందంగా కనిపించింది. విక్రమాదిత్యకి గురువు పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. భాగ్యశ్రీ ప్రభాస్‌కి తల్లిగా కనిపించింది. కానీ ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సచిన్ ఖేడేకర్, జగపతిబాబు, జయరాం తదితర నటులున్నా వాళ్ల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఈ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టింది. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది కళే. ఆ కళని అంతే అందంగా తెరపైకి తీసుకొచ్చింది మనోజ్ పరమహంస కెమెరా. యూరప్ నేపథ్యంలో ఈ సినిమా సాగడం విజువల్‌గా కలిసొచ్చిన విషయం. చాలా సన్నివేశాల్ని యూరప్ పోలిన సెట్స్‌లో తెరకెక్కించినా ఎక్కడా ఆ తేడా కనిపించదు. సంగీతం బాగుంది. ఎవరో నీవెవరో, ఛలో ఛలో పాటలు, వాటి చిత్రణ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథని అంతే స్పష్టంగా చెప్పారు. ప్రభాస్ కోసమని మాస్ అంశాల్ని ఇరికించే ప్రయత్నం చేయలేదు. కథలో భావోద్వేగాలు, సంఘర్షణ పరంగా మాత్రం ఆయన చేసిన కసరత్తులు సరిపోలేదనిపిస్తుంది.
బలాలు