Radhe Shyam Director: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల థియేటర్లలో విడుదలకావాల్సిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పాన్‌ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'తో పాటు బాలీవుడ్ 'జెర్సీ' విడుదలకు వెనకడుగు వేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జనవరి14న విడుదల కావాల్సిన 'రాధేశ్యామ్'పై పడింది. అనుకున్న రోజుకే ఈ చిత్రం వస్తుందా లేదా వాయిదా పడుతుందా అనే చర్చ నడుస్తుండగా.. మంగళవారం రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
"సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా, మనసులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా ఆశలు ఉన్నతంగా ఉన్నాయి" అంటూ ట్వీట్ చేశారు రాధాకృష్ణ. దీనికి స్పందించిన ఓ నెటిజన్.. 'వాయిదా వేస్తున్నట్లు పరోక్షంగా చెబుతున్నావా అన్నా' అని అడగగా.. అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా చెబుతామని రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
"ఇలాంటి సమయాల్లోనే మనసును మరింత దృఢం చేసుకోవాలి. 'రాధేశ్యామ్' టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్" అని 'బాహుబలి' చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.